‘బిగ్ బాస్’ సెంటిమెంటు తుస్సుమంది

‘బిగ్ బాస్’ సెంటిమెంటు తుస్సుమంది

హిందీ ‘బిగ్ బాస్’ షోను సినిమా ప్రమోషన్ల కోసం చాలామంది వాడుకున్నారు. అది ఆ సినిమాల వాళ్లకే కాక.. ‘బిగ్ బాస్’ షోకు కూడా బాగా కలిసొచ్చింది. ఇదే సంప్రదాయాన్ని తెలుగు ‘బిగ్ బాస్’ షోలోనూ కొనసాగించారు. గత ఐదు వారాల నుంచి సెలబ్రెటీలు షోలో సందడి చేస్తున్నారు. ముందుగా గత నెలలో రానా దగ్గుబాటి ‘బిగ్ బాస్’ షోకు వెళ్లాడు.

తన ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాను ప్రమోట్ చేశాడు. ఆ సినిమా సూపర్ హిట్టయి.. మిగతా సెలబ్రెటీల్ని కూడా ఆకర్షించింది. తర్వాతి వారం ‘ఆనందో బ్రహ్మ’ కోసం తాప్సి.. ఆపై వారం ‘అర్జున్ రెడ్డి’ కోసం విజయ్ దేవరకొండ ‘బిగ్ బాస్’ హౌస్ లో అడుగుపెట్టారు. ఆ రెండు సినిమాలు కూడా మంచి సక్సెస్ కావడంతో ‘బిగ్ బాస్’ ఒక పాజిటివ్ సెంటిమెంటుగా మారిపోయింది.

కానీ ఇంతలోనే ఈ సెంటిమెంటుకు బ్రేక్ పడిపోయింది. గత రెండు వారాల్లో ఇద్దరు కామెడీ హీరోలు ‘బిగ్ బాస్’కు వెళ్లగా.. ఆ ఇద్దరి సినిమాలూ బోల్తా కొట్టాయి. ‘మేడ మీద అబ్బాయి’ విడుదలకు ముందు అల్లరి నరేష్.. ‘ఉంగరాల రాంబాబు’ సినిమా కోసం సునీల్ ‘బిగ్ బాస్’లో అడుగుపెట్టారు. తమ సినిమాల గురించి గొప్పగా చెప్పుకున్నారు. కానీ ఆ రెండు సినిమాలూ తేడా కొట్టేసి.. ‘బిగ్ బాస్’ పాజిటివ్ సెంటిమెంటును దెబ్బ తీశాయి.

ఇక వచ్చే గురువారం విడుదలయ్యే ‘జై లవకుశ’ను కూడా ‘బిగ్ బాస్’లో ప్రమోట్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట. ఈ సినిమా హీరో ఎన్టీఆరే షోను హోస్ట్ చేస్తున్న నేపథ్యంలో అతనెలా ఈ సినిమాను ప్రమోట్ చేస్తాడో.. ఈ సినిమాకు ఎలాంటి ఫలితం వస్తుందో చూద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు