సెప్టెంబర్ బాబోయ్ సెప్టెంబర్..

సెప్టెంబర్ బాబోయ్ సెప్టెంబర్..

వేసవిలో ‘బాహుబలి: ది కంక్లూజన్’ సందడి ముగిశాక తెలుగు ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూసిన నెల సెప్టెంబరే. మహేష్ బాబు, ఎన్టీఆర్, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోలు రేసులో ఉండటంతో ఈ నెల హంగామా మామూలుగా ఉండదని.. సినీ ప్రియులకు పండగే అని ఆశపడ్డారు.

ఐతే ఇప్పటిదాకా మూడు వారాల్లో వచ్చిన సినిమాలు.. వాటి ఫలితాలు చూస్తే మాత్రం ఇటు ఇండస్ట్రీకి.. అటు ప్రేక్షకులకు దిమ్మదిరిగిపోతోంది. వారం వారం షాకుల మీద షాకులతో బెంబేలెత్తిపోతున్నారు జనాలు. నెలాఖరున రావాల్సిన బాలయ్య మూవీ ‘పైసా వసూల్’ ముందుకొచ్చి సెప్టెంబరు 1నే ప్రేక్షకుల్ని పలకరించాడు. ఈ సినిమాతోనే మొదలైంది మోత.

‘పైసా వసూల్’ ప్రేక్షకుల్ని తీవ్ర నిరాశకు గురి చేసింది. వసూళ్లు కూడా దారుణంగా వచ్చాయి. ఇదే ఏడాది ఆరంభంలో వచ్చిన బాలయ్య సినిమాకు రూ.60 కోట్ల దాకా షేర్ వస్తే.. ‘పైసా వసూల్’కు అందులో మూడో వంతు మాత్రమే వసూలైంది. దీని తర్వాత నాగచైతన్య సినిమా ‘యుద్ధం శరణం’ మీద ఆశలు పెట్టుకున్నారు జనాలు. కానీ ఆ సినిమా కూడా తీవ్రంగా నిరాశ పరిచింది. చైతూ కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా నిలిచిందా సినిమా. దీంతో పాటుగా విడుదలైన అల్లరి నరేష్ సినిమా ‘మేడ మీద అబ్బాయి’ సంగతి చెప్పాల్సిన పని లేదు. అది కూడా తేలిపోయింది.

ఇక ఈ వీకెండ్లో వచ్చిన సినిమాలు చూసి జనాలు హాహాకారాలు పెడుతున్నారు. ‘ఉంగరాల రాంబాబు’, ‘కథలో రాజకుమారి’, ‘శ్రీవల్లీ’.. వీటిలో ఏదీ దేనికీ తీసిపోని రీతిలో ప్రేక్షకుల్ని టార్చర్ పెట్టేశాయి. మొత్తానికి అద్భుతంగా ఉంటుందనుకున్న సెప్టెంబరు ఇప్పటిదాకా చుక్కలు చూపిస్తూ వచ్చింది. ఇక చివరి రెండు వారాల్లో రాబోయే ‘జై లవకుశ’, ‘స్పైడర్’, ‘మహానుభావుడు’ ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతినిస్తాయో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు