‘రూపాయి’ సినిమాకు సూపర్ హిట్ టాక్

‘రూపాయి’ సినిమాకు సూపర్ హిట్ టాక్

కోలీవుడ్లో ఇప్పుడందరి దృష్టీ విశాల్ మీదే ఉంది. ఓవైపు ఇండస్ట్రీని పీల్చి పిప్పి చేసేస్తున్న పైరసీ మీద యద్ధాన్ని కొనసాగిస్తూనే.. మరోవైపు తమిళ రైతుల్ని ఆదుకునేందుకు విశాల్ తన వంతు ప్రయత్నం చేస్తుండటంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. విశాల్ కొత్త సినిమా ‘తుప్పారివాలన్’ ఈ గురువారమే విడుదలైంది.

ఈ సినిమాకు అమ్ముడయ్యే ప్రతి టికెట్ లోంచి ఒక రూపాయి రైతు సంక్షేమ నిధికి వెళ్తుందని ప్రకటించి అందరి మనసులూ గెలిచాడు విశాల్. అతను చేసిన ప్రకటనతో ఈ సినిమా మీద ఒక సానుకూల అభిప్రాయం ఏర్పడింది. ఈ సినిమా బాగా ఆడాలని ఆకాంక్షించారు అందరూ. ఆ ఆకాంక్షలు ఫలించాయి.

‘తుప్పారివాలన్’ సూపర్ హిట్ టాక్‌తో మొదలైంది. విలక్షణమైన సినిమాలు తీసే సీనియర్ డైరెక్టర్ మిస్కిన్ రూపొందించిన చిత్రమిది. ఇందులో విశాల్ డిటెక్టివ్ పాత్ర చేశాడు. ఆద్యంతం ఉత్కంఠ రేపేలా ఈ థ్రిల్లర్ మూవీ సాగుతూ.. ఉర్రూతలూగిస్తుందని క్రిటిక్స్ అంటున్నారు. ఇటు తమిళ వెబ్ సైట్లు.. అటు జాతీయ పత్రికలు ఈ చిత్రానికి మంచి రేటింగ్స్ ఇచ్చారు. మిస్కిన్ డైరెక్షన్.. విశాల్ యాక్టింగ్ సూపరని ప్రశంసిస్తున్నారు.

క్లైమాక్స్ సినిమాకు మేజర్ హైలైట్ అంటున్నారు. యాక్షన్ ఎపిసోడ్ల గురించి కూడా ప్రత్యేకంగా చెబుతున్నారు. తెలుగులో ‘పిశాచి’ పేరుతో వచ్చిన హార్రర్ థ్రిల్లర్ రూపొందించింది మిస్కినే. అతడి సినిమాలో అదో టైపులో ఉంటాయి. ఎక్కువగా చిన్న స్థాయి హీరోలతో సినిమాలు చేసే మిస్కిన్.. తొలిసారి విశాల్ లాంటి స్టార్‌తో సినిమా చేసి హిట్టు కొట్టాడు. ఈ చిత్రాన్ని తెలుగులోకి కూడా అనువాదం చేసి రిలీజ్ చేయనున్నారు. మరి ఈ చిత్రం ద్వారా రైతు సంక్షేమ నిధికి ఎంతమేరకు నిధులు వెళ్తాయో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు