సునీల్ సెంటిమెంటును నమ్ముకున్నాడు

సునీల్ సెంటిమెంటును నమ్ముకున్నాడు

కామెడీ వేషాలు వదిలేసి హీరోగా స్థిరపడిపోయిన సునీల్.. మళ్లీ పాత దారిలోకి మళ్లాలని నిర్ణయించుకున్నాడు. మళ్లీ తాను కమెడియన్ రోల్స్ కూడా చేస్తానని సునీల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగని హీరో పాత్రలు వదిలేది లేదని కూడా సునీల్ స్పష్టం చేశాడు.

ఐతే హీరోగా వరుసగా ఎదురు దెబ్బలు తింటున్న సునీల్ కు ఇకపై లీడ్ రోల్స్ ఎవరిస్తారన్న సందేహాలు కూడా జనాల్లో ఉన్నాయి. కానీ సునీల్ కు మాత్రం అవకాశాలు ఆగడం లేదు. ‘ఉంగరాల రాంబాబు’ సెట్స్ మీద ఉండగానే.. ‘టు కంట్రీస్’ రీమేక్ కూడా చకచకా పూర్తి చేసేసిన సునీల్.. కొత్తగా ఇంకో ఛాన్స్ పట్టేశాడు. అతను ఓ రీమేక్ మూవీలో నటించబోతున్నాడు.

తమిళంలో మూడేళ్ల కిందట పెద్దగా అంచనాల్లేకుండా విడుదలై సంచలన విజయం సాధించిన ‘శతురంగ వేట్టై’ రీమేక్ లో సునీల్ నటించబోతున్నాడు. ‘అఆ’ సినిమాకు ఛాయాగ్రహణం అందించిన నటరాజ్ సుబ్రమణ్యం కథానాయకుడిగా నటించిన సినిమా ఇది. రకరకాల మోసాలు చేసి జనాల్ని బోల్తా కొట్టిస్తూ బతికే వ్యక్తి కథ ఇది. ఎంటర్టైన్ చేస్తూనే థ్రిల్లింగ్ గా సాగుతుందీ సినిమా.

ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్ కూడా తయారవుతోంది తమిళంలో. ఓ తమిళ డిస్ట్రిబ్యూటర్ ‘శతురంగ వేట్టై’ని తెలుగులో రీమేక్ చేయబోతున్నాడట. దర్శకుడెవరన్నది ఇంకా ఖరారవ్వలేదు. హీరోగా మాత్రం సునీల్ ఫిక్సయ్యాడు. సునీల్ ఇంతకుముందు నటించిన రెండు రీమేక్ సినిమాలు (అందాల రాముడు.. తడాఖా) మంచి ఫలితాన్నే అందుకున్నాయి. ఈ నేపథ్యంలో సక్సెస్ కోసం సెంటిమెంటుగా మళ్లీ రీమేక్‌ను నమ్ముకున్నట్లున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు