లాక్ డౌన్ 4.0..ఇవే కొత్త రూల్స్‌

కరోనా క‌ల‌క‌లం నేప‌థ్యంలో ప్రధాని మోదీ ప్రకటించిన లాక్‌డౌన్‌-3.0 ఆదివారంతో పూర్తి కానుండటంతో సోమవారం నుండి లాక్‌డౌన్‌ కొనసాగిస్తారా లేక సడలిస్తారా అన్న అంశంపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈనెల 11న ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అభిప్రాయాలను సేకరించారు.

అయితే, మెజార్టీ రాష్ట్రాలు లాక్‌డౌన్‌ కొనసాగింపును సమర్ధిస్తూనే కేంద్రం రాష్ట్రాలకు అవసరమైన ఆర్ధిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశాయి. ఈ నేప‌థ్యంలో కొత్త నిబంధ‌న‌ల‌పై ఉత్కంఠ నెల‌కొంది.

వివిధ వ‌ర్గాల నుంచి అందుతున్న స‌మాచారం ప్ర‌కారం, నాలుగో విడుత లాక్‌డౌన్‌లో మరిన్ని ఆంక్షలను సడలించనున్నారు. గ్రీన్‌జోన్లలో పూర్తిగా ఆంక్షలను ఎత్తివేసే అవకాశం ఉంది. ఆరెంజ్‌ జోన్లలో పరిమిత స్థాయిలో, కంటైన్మెంట్‌ జోన్లలో మాత్రం కఠిన ఆంక్షలను అమలుచేయనున్నారు.

రైల్వే, దేశీయ విమాన రాకపోకలను దశలవారీగా ప్రారంభించనున్నట్లు కేంద్ర అధికారి ఒకరు పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా విద్యాసంస్థలు, మాల్స్‌, సినిమా హాళ్లను తెరిచే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. అయితే కంటైన్మెంట్‌ ప్రాంతాలు మినహా రెడ్‌జోన్లలోనూ క్షౌరశాలలు, ఆప్టికల్‌ దుకాణాలను తెరువనున్నట్లు చెప్పారు.

ఇదిలాఉండ‌గా, తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే లాక్‌డౌన్‌ను ఈనెలాఖరు వరకూ పొడగిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఏపీ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుందనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఇదే అంశంపై శనివారం అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్‌ నిర్వహించిన సమీక్ష సందర్భంగా సాధారణ కార్యకలాపాలకు ఎస్ఓపీ తయారు చేయాల్సిందిగా ఆదేశించారు. దీంతో ఏపీలో లాక్‌డౌన్‌ 4.0 సడలింపులతో ఉండబోతుందని ఒక సంకేతాన్ని పంపారు. కంటైన్‌ మెంట్‌ జోన్లు మినహా మిగిలిన అన్ని జోన్లలోనూ సాధారణ కార్యకలాపాలు నిర్వహించేందుకు రాష్ర ప్రభుత్వం సన్నద్ధమౌతోందని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.