శ్రీవల్లీ వెనుక విషాదం

శ్రీవల్లీ వెనుక విషాదం

రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ రచయితే కాదు.. దర్శకుడు కూడా. ఆయన ఇంతకుముందు ‘శ్రీకృష్ణ 2006’, ‘రాజన్న’ సినిమాలు తీశారు. ఇప్పుడు మూడో సినిమా ‘శ్రీవల్లీ’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ శుక్రవారమే ఈ సినిమా విడుదలవుతోంది. ఐతే ఇప్పటిదాకా విడుదలైన ‘శ్రీవల్లీ’ ప్రోమోలు చూస్తే ఈ సినిమా కథేంటనే విషయంలో స్పష్టత రాలేదు.

టీజర్, ట్రైలర్ అన్నీ కూడా కన్ఫ్యూజింగ్‌గా అనిపించాయి. ఇంతకీ ఈ సినిమా కథేంటి.. అది ఎలా పుట్టింది అని అడిగితే.. ఆయన ఆసక్తికర విషయాలు చెప్పారు. ఓ విషాదం నుంచి ‘శ్రీవల్లీ’ కథ పుట్టిందని ఆయన చెప్పారు.

‘‘వాల్మీకి రాసిన ‘రామాయణం’ విషాదం నుంచి పుట్టినట్లే ‘శ్రీవల్లీ’ కూడా విషాదం నుంచే పుట్టింది. రమేష్ అని నా ప్రాణ మిత్రుడు విజయవాడలో ఉండేవాడు. ఐతే మేమిద్దరం చాలా ఏళ్ల పాటు కలవలేదు. ఓసారి వినాయక చవితి రోజు బాగా గుర్తొచ్చాడు. ఆ తర్వాత వాడిని కలుద్దామని విజయవాడకు వెళ్తే చనిపోయాడని తెలిసింది. నాకు అతను గుర్తొచ్చిన వినాయక చవితి రోజునే.. అతను కూడా నా గురించి పదే పదే తలుచుకొన్నాడని అతడి కుటుంబ సభ్యులు చెప్పారు. ఈ విషయం అతడి డైరీలో కూడా రాసుకున్నాడట. మేమిద్దరం ఒకరి గురించి ఒకరు ఒకే సమయంలో ఎలా ఆలోచించామన్న ప్రశ్న తలెత్తింది. శబ్ద తరంగాల్లాగా మనిషిలోని ఆలోచనా తరంగాలు ఒకరి నుంచి మరొకరికి చేరతాయా.. అన్న సందేహం కలిగింది. అందులోంచి పుట్టిన కథే ఇది. మనిషి మనసుని చదవగలిగితే దుర్మార్గులను సైతం సన్మార్గులుగా మార్చవచ్చన్న అంశానికి పునర్జన్మల కథని మిళితం చేసి సైంటిఫిక్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమాను రూపొందించాను’’ అని విజయేంద్ర తెలిపారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English