మణిరత్నంకు అతనే దొరికాడా..?

మణిరత్నంకు అతనే దొరికాడా..?

మణిరత్నం దర్శకత్వంలో ఒక్కసారైనా నటించడం చాలామంది కల. ఇందుకు స్టార్ హీరోలు కూడా మినహాయింపు కాదు. మణి దర్శకత్వంలో నటించడాన్ని ఒక గౌరవంగా.. ఒక అచీవ్మెంట్ లాగా భావిస్తారు హీరోలు. ఐతే ఇదంతా గతం. ఇప్పుడు మణిరత్నం కోరుకున్న హీరోలే ఆయనతో నటించడానికి ముందుకు రావట్లేదు.

మహేష్ బాబు, అక్కినేని నాగార్జున, రామ్ చరణ్.. వీళ్లందరూ మణిరత్నం ఆసక్తి చూపించినప్పటికీ ఆయనతో సినిమాలు చేయని హీరోలు. మరోవైపు తమిళంలో కూడా కొందరు హీరోలు మణిరత్నంకు నో చెప్పినట్లు సమాచారం. ‘విలన్’, ‘కడలి’ లాంటి సినిమాలు మణిరత్నం ఇమేజ్‌ను బాగా డ్యామేజ్ చేసినప్పటికీ.. ‘ఓకే బంగారం’తో కొంచెం పుంజుకున్నట్లే కనిపించాడీ లెజెండ్.

కానీ ‘చెలియా’ ఆయన్ని మళ్లీ వెనక్కి లాగేసింది. ఇప్పుడు మణితో సినిమా చేయడం ప్రమాదమన్న అభిప్రాయంలో హీరోలున్నారు. ఈ నేపథ్యంలో మణి తన స్థాయికి కొంచెం తక్కువైన హీరోలే ఎంచుకుంటున్నాడు. గత కొన్నేళ్లలో నటుడిగా మంచి గుర్తింపు సంపాదించిన విజయ్ సేతుపతిని తన కొత్త సినిమాలో ఒక కథానాయకుడిగా ఎంచుకున్న మణి.. లేటెస్టుగా ఇంకో హీరోగా కోలీవుడ్ బ్యాడ్ బాయ్ శింబును ఫైనలైజ్ చేసినట్లు వార్తలొస్తున్నాయి.

విజయ్ సేతుపతి సంగతి ఓకే కానీ.. శింబును ఎంచుకోవడంపైనే కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. నటుడిగా శింబుకు అంత మంచి పేరేమీ లేదు. పైగా అతనెప్పుడూ వివాదాలతో సావాసం చేస్తుంటాడు. మరి మణికి వేరే ఛాయిసే లేకపోయిందా అంటున్నారు చాలామంది. మరోవైపు మణి కొత్త సినిమాలో నాని నటిస్తాడన్న ప్రచారమూ జరుగుతోంది. ఈ మల్టీస్టారర్ మూవీకి సంబంధించి అరవింద్ స్వామి, జ్యోతికల పేర్లూ వినిపిస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు