రాజమౌళి ఆగాడు.. మంచిదైంది

రాజమౌళి ఆగాడు.. మంచిదైంది

రాజమౌళి ట్విట్టర్లో తన సినిమాల కంటే కూడా తనకు బాగా నచ్చిన, తన మిత్రులకు సంబంధించిన సినిమాల గురించి స్పందిస్తుంటాడు. ఆ మిత్రుల్లో సాయి కొర్రపాటి ఒకడు. రాజమౌళితో రాజీ లేకుండా ‘ఈగ’ సినిమాను నిర్మించి అతడికి సన్నిహితుడైపోయాడు సాయి. అప్పట్నుంచి ఆయన తీస్తున్న ప్రతి సినిమాకూ ప్రమోషన్ పరంగా తన వంతు సాయం చేస్తుంటాడు రాజమౌళి.

ఆడియో వేడుకలకు రావడం, సినిమా చూశాక పాజిటివ్ ట్వీట్లు పెట్టడం మామూలే. ఐతే ఈ ఏడాది సాయి నుంచి వచ్చిన ‘రెండు రెళ్లు ఆరు’, ‘పటేల్ సార్’ సినిమాల గురించి పాజిటివ్‌గా మాట్లాడి క్రెడిబిలిటీ కోల్పోయాడు జక్కన్న. సాయి ప్రొడక్షన్లో వచ్చిన ‘యుద్ధం శరణం’ గురించి కూడా ఆడియో వేడుకలో గొప్పగా చెప్పాడు.

ఆ తర్వాత సినిమా చూసి కూడా రాజమౌళి స్పందిస్తాడని అనుకున్నారు. నిజానికి తన కుటుంబంతో కలిసి రాజమౌళి ఈ సినిమా చూశాడట. కానీ దీని గురించి ట్వీట్లు పెట్టడంలో తనను తాను నియంత్రించుకున్నాడు. పొరబాటున దీని గురించి జక్కన్న పాజిటివ్ ట్వీట్లు చేసి ఉన్నాడో అంతే సంగతులు. ఆయన క్రెడిబిలిటీ పూర్తిగా దెబ్బ తినేదే.

‘యుద్ధం శరణం’కు విడుదలకు ముందు ఉన్న బజ్ ప్రకారం చూస్తే టాక్ ఎలా ఉన్నా ఓ మోస్తరుగా మంచి ఓపెనింగ్స్ తెచ్చుకుంటుందని అనుకున్నారు. కానీ ఈ సినిమాకు దారుణమైన ఆరంభ వసూళ్లు వచ్చాయి. సినిమా పెద్ద డిజాస్టర్ అని తేలిపోయింది. కాబట్టి ఈ సినిమా గురించి విడుదల తర్వాత స్పందించకుండా కొంతలో కొంతైనా క్రెడిబిలిటీని కాపాడుకున్నాడు రాజమౌళి.