‘మగధీర’లో ఆ సీన్ చిరు కోసం రాసిందట

‘మగధీర’లో ఆ సీన్ చిరు కోసం రాసిందట

‘మగధీర’ సినిమాను గుర్తుకు తెచ్చుకోగానే అందులో 100 మందితో కాలభైరవుడి పోరాటమే గుర్తుకొస్తుంది. ఆ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లిన ఎపిసోడ్ అదే. ఐతే ‘మగధీర’కు ఆయువుపట్టుగా నిలిచిన ఆ సన్నివేశం నిజానికి ఈ సినిమా కోసం రాసుకున్నది కాదట. ఈ ఎపిసోడ్ ఒక సినిమా కోసం కాకుండా ప్రత్యేకంగా రాసుకున్నదని.. అది కూడా మెగాస్టార్ చిరంజీవి కోసం రెడీ చేసిందని రైటర్ విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు.

తన దర్శకత్వంలో రూపొందిని ‘శ్రీవల్లీ’ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు రామ్ చరణ్ ముఖ్య అతిథిగా వచ్చిన నేపథ్యంలో విజయేంద్ర ప్రసాద్ అతడి గురించి మాట్లాడుతూ ఈ విషయాన్ని బయటపెట్టారు. దాని వెనుక ఆసక్తికర కథాకమామిషేంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం పదండి.

‘‘సింహాద్రి సినిమా సూపర్ హిట్టయ్యాక మీడియా వాళ్లు రాజమౌళిని.. చిరంజీవితో సినిమా చేయరా అని అడిగారు. దానికి బదులిస్తూ.. చిరంజీవితో నేను సినిమా చేయడమేంటి.. ఆయన వరమివ్వాలి కానీ.. తెలుగులో ప్రతి దర్శకుడూ ఒక్క సినిమా అయినా చేసి తీరాలని కోరుకునే దర్శకుడు చిరంజీవి గారే అని చెప్పాడు. ఆ తర్వాత చిరంజీవి గారిని కలిసే అవకాశం నాకు, రాజమౌళికి వచ్చింది.

ఆయన తనతో సినిమా చేయమని అడిగారు. మహాభాగ్యం అనుకుని వెళ్లి ‘మగధీర’లో వచ్చే 100 మందితో హీరో ఫైట్ ఎపిసోడ్ రాసుకుని వెళ్లి ఆయనకు చెప్పాం. ఆయనకు బాగా నచ్చింది. దాని ఆధారంగా సినిమా చేద్దామన్నారు. ఐతే కొన్ని కారణాల వల్ల ఆయనతో సినిమా చేయడం కుదర్లేదు. తర్వాత అనుకోకుండా చరణ్‌తో ‘మగధీర’ చేశాం. ఆ సినిమాకు ఆ సీన్ వాడుకున్నాం’’ అని విజయేంద్ర ప్రసాద్ చెప్పారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు