112 కోట్ల ‘జై లవకుశ’

112 కోట్ల ‘జై లవకుశ’

రెండు మూడేళ్ల కిందటి వరకు జూనియర్ ఎన్టీఆర్ పరిస్థితి అయోమయంగా ఉండేది. అతడి సినిమాలకు 50-60 కోట్ల మధ్య బిజినెస్ జరగడమే గగనంగా ఉండేది. ఐతే టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్‌ సినిమాలతో హ్యాట్రిక్ హిట్లు కొట్టడంతో ఎన్టీఆర్ రేంజే మారిపోయింది.

ఈ రెండు మూడేళ్లలో తెలుగు సినిమాల మార్కెట్ పరిధి కూడా విస్తరించి.. ఎన్టీఆర్ కొత్త సినిమా ‘జై లవకుశ’ బిజినెస్ ఏకంగా రూ.112 కోట్లకు చేరడం విశేషం. మామూలు మాస్ సినిమాలాగే కనిపిస్తున్న ‘జై లవకుశ’కు ఈ రేంజిలో బిజినెస్ జరుగుతుందని ఎవరూ ఊహించలేదు.

‘జై లవకుశ’ రెండు తెలుగు రాష్ట్రాల హక్కులే రూ.67.5 కోట్లు పలకడం విశేషం. నైజాం ఏరియాకు ఏకంగా ‘జై లవకుశ’ రూ.21.2 కోట్లకు అమ్ముడైంది. సీడెడ్ రైట్స్ రూ.12.6 కోట్లకు అమ్ముడయ్యాయి. వైజాగ్ హక్కులు రూ.8 కోట్లు పలికాయి. ఆంధ్రాలో మిగతా అన్ని ఏరియాలూ కలిపి రూ.26 కోట్లు తెచ్చిపెట్టాయి. కర్ణాటక హక్కులు రూ.8.2 కోట్లకు.. ఓవర్సీస్ రైట్స్ రూ.8.5 కోట్లకు అమ్ముడయ్యాయి.

మిగతా ఏరియాల థియేట్రికల్ రైట్స్ ఇంకో రూ.2 కోట్లు తెచ్చాయి. శాటిలైట్ హక్కుల ద్వారా రూ.14.6 కోట్లు.. హిందీ డబ్బింగ్ హక్కుల ద్వారా రూ.11 కోట్లు.. ఆడియో హక్కులు రూ. కోటి పలికాయి. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా రూ.112 కోట్లకు బిజినెస్ చేసింది ‘జై లవకుశ’. థియేట్రికల్ రైట్స్ మాత్రమే రూ.86 కోట్లు పలికిన నేపథ్యంలో అంత మొత్తం వసూలు చేస్తేనే సేఫ్ జోన్లోకి వస్తుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు