యాక్షన్ సినిమాలు వద్దంటే వినడే..

యాక్షన్ సినిమాలు వద్దంటే వినడే..

అక్కినేని నాగచైతన్య తొలి సినిమా 'జోష్'ను యాక్షన్ ప్రధానంగా లవ్ స్టోరీ. దాని ఫలితమేంటో తెలిసిందే. ఇక 'ఏమాయ చేసావె', '100 పర్సంట్ లవ్' లాంటి సూపర్ హిట్ లవ్ స్టోరీల తర్వాత యాక్షన్ జానర్లో 'దడ' చేశాడు. అదేమైందో తెలిసిందే. 'ఆటోనగర్ సూర్య' గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆపై 'మనం' లాంటి క్లాసిక్ తర్వాత మళ్లీ 'దోచేయ్' అంటూ యాక్షన్ థ్రిల్లర్ ట్రై చేశాడు.

అదీ తేడా కొట్టేసింది. ఈ దెబ్బతో చైతూ ఇక యాక్షన్ సినిమాల జోలికే వెళ్లడని అనుకున్నారంతా. దీనికి తోడు అతను చేసిన రెండు లవ్ స్టోరీలు 'ప్రేమమ్'.. 'రారండోయ్ వేడుక చూద్దాం' సూపర్ హిట్టయి చైతూ లవర్ బాయ్ ఇమేజ్ ను మరింత పెంచాయి.

ఐతే అదేంటో కానీ.. చైతూ యాక్షన్ సినిమాల మోజు మాత్రం వదిలించుకోవట్లేదు. మళ్లీ 'యుద్ధం శరణం' అంటూ యాక్షన్ మూవీ చేశాడు. దానికి తొలి రోజే నెగెటివ్ టాక్ వచ్చింది. చైతూకు యాక్షన్ సినిమాలు పడవని.. అలాంటి సినిమాల్ని ప్రేక్షకులు రిసీవ్ చేసుకోరని మళ్లీ మళ్లీ రుజువవుతూనే ఉన్నా అతను మాత్రం మారట్లేదు. యాక్షన్ సినిమాలు చేసి మాస్ ఇమేజ్ తెచ్చుకుంటే అది ఓపెనింగ్స్‌కు ఉపయోగపడుతుందని.. మార్కెట్ పెరుగుతుందని చైతూ మళ్లీ మళ్లీ ఈ జానర్లో సినిమాలు చేస్తున్నట్లున్నాడు.

ఐతే మార్కెట్ పెరగడం.. మాస్ ఇమేజ్ తెచ్చుకోవడం మాటేమో కానీ.. లవ్ స్టోరీలతో హిట్లు కొట్టడం ద్వారా వచ్చిన మార్కెట్టే దెబ్బ తింటోంది. మరి 'యుద్ధం శరణం' ఫలితం చూశాకైనా చైతూ పాఠాలు నేర్చుకుంటాడా.. మళ్లీ అదే జానర్లో ట్రై చేసి ఎదురు దెబ్బలు తింటాడా.. అన్నది చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు