రెండు థియేటర్లలో రెండు కోట్లు

రెండు థియేటర్లలో రెండు కోట్లు

ఒక టౌన్లో కోటి రూపాయలు వసూలు చేయడం.. ఒక థియేటర్లో కోటి రూపాయలు కొల్లగొట్టడం లాంటి విషయాలు స్టార్ హీరోల సినిమాల విషయంలోనే వింటుంటాం. కానీ ఎలాంటి స్టార్ కాస్ట్ లేకుండా తక్కువ బడ్జెట్లో తెరకెక్కిన ఒక క్లాస్ లవ్ స్టోరీ రెండు థియేటర్లలో కోటి రూపాయల చొప్పున గ్రాస్ కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది.

ఆ సినిమా మరేదో కాదు.. ఫిదా. ఈ చిత్రం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని ‘సుదర్శన్’ థియేటర్‌తో పాటు.. వైజాగ్‌లో సూపర్ ఫేమస్ అయిన ‘జగదాంబ’ థియేటర్‌లోనూ కోటి రూపాయల చొప్పున గ్రాస్ వసూలు చేయడం విశేషం. ‘ఫిదా’ 50 రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో పోస్టర్ల మీద ఈ విషయాన్ని ఘనంగా ప్రకటించుకున్నారు.

సుదర్శన్ థియేటర్లో కోటి రూపాయల గ్రాస్ సాధించడం కంటే కూడా జగదాంబ థియేటర్లో కోటి రూపాయలు రాబట్టడం పెద్ద విశేషమే. ఎందుకంటే ‘ఫిదా’ తెలంగాన నేటివిటీతో, ఆ యాసతో పండే కామెడీ మీద నడిచే సినిమా. ఇలాంటి సినిమాకు వైజాగ్‌లో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టి ఆ స్థాయిలో కలెక్షన్లు కురిపించడం గొప్ప విషయమే. ఈ విషయంలో శేఖర్ కమ్ముల అండ్ టీంకు ప్రత్యేక అభినందనలు చెప్పాలి.

ఇక ఈ సినిమా 85 కేంద్రాల్లో 50 రోజులు ఆడటం మరో విశేషం. ఇవేవీ పని గట్టుకుని ఆడించిన సెంటర్లు కూడా కావు. జెన్యూన్‌గా అన్ని చోట్లా 50 రోజులాడిన సినిమా ఇది. ఈ రోజుల్లో ‘ఫిదా’ లాంటి చిన్న సినిమా ఇలాంటి ఘనత సాధించడం చిన్న విషయం కాదు. మొత్తానికి శేఖర్ కమ్ములకిది మామూలు కమ్ బ్యాక్ కాదన్నమాట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు