అల్లరోడు ‘బిగ్ బాస్’ను నమ్ముకున్నాడు

 అల్లరోడు ‘బిగ్ బాస్’ను నమ్ముకున్నాడు

సినీ పరిశ్రమలో సెంటిమెంట్లకు కొదవుండదు. ఒక సినిమా హిట్టయితే దానికి సంబంధించిన అనేక విషయాలను సెంటిమెంటుగా భావిస్తుంటారు. ఈ మధ్య టాలీవుడ్ జనాల్లో ఓ కొత్త సెంటిమెంటు మొదలైంది. తెలుగు జనాల్లో రెండు నెలలుగా పెద్ద చర్చనీయాంశంగా మారిన ‘బిగ్ బాస్’ షోకు వెళ్లి తమ కొత్త సినిమాను ప్రమోట్ చేసుకుంటే అది సూపర్ హిట్టవడం గ్యారెంటీ అన్నదే ఆ సెంటిమెంటు.

ఇందుకు ఉదాహరణలు లేకపోలేదు. ముందుగా దగ్గుబాటి రానా ‘బిగ్ బాస్’ హౌస్‌లోకి వెళ్లి.. తన ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాను ప్రమోట్ చేసుకున్నాడు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత ‘ఆనందో బ్రహ్మ’ విడుదలకు ముందు తాప్సి పన్ను ‘బిగ్ బాస్’ హౌస్‌కు వెళ్లింది. ఆ చిత్రం కూడా సూపర్ హిట్టే. ఇక టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ ‘అర్జున్ రెడ్డి’ విడుదలకు ముందు రోజు ఆ చిత్ర కథానాయకుడు విజయ్ దేవరకొండ కూడా ‘బిగ్ బాస్’ హౌస్‌లో గడిపి వచ్చాడు. దీంతో ‘బిగ్ బాస్’ హిట్ సెంటిమెంటును తాను కూడా వాడేసుకున్నాడు అల్లరి నరేష్.

అతను గురువారం రాత్రి ‘బిగ్ బాస్’ హౌస్‌లో కనిపించాడు. హౌస్‌లోకి వెళ్లి పార్టిసిపెంట్లతో శుక్రవారం రిలీజవ్వబోయే ‘మేడ మీద అబ్బాయి’ సినిమా ముచ్చట్లు పంచుకున్నాడు. ఒకప్పుడు ఫ్లాప్ సినిమాలతో కూడా పెట్టుబడి వెనక్కి తెప్పిస్తూ మినిమం గ్యారెంటీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నరేష్.. ఐదేళ్లుగా హిట్టు ముఖమే చూడక బాగా డీలా పడిపోయాడు. ఇప్పుడతడి ఆశలన్నీ ‘మేడ మీద అబ్బాయి’ మీదే ఉన్నాయి. మరి ‘బిగ్ బాస్’ సెంటిమెంటు అతడికి కలిసొచ్చి ఈ సినిమా హిట్టవుతుందేమో చూద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు