‘బాహుబలి-2’ అక్కడ విడుదల కాదా?

‘బాహుబలి-2’ అక్కడ విడుదల కాదా?

‘బాహుబలి: ది బిగినింగ్’ ఇండియాలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో అదరగొట్టింది. అమెరికా సహా అనేక దేశాల్లో భారీ వసూళ్లు సాధించింది. కానీ చైనాలో మాత్రం ఈ చిత్రానికి చేదు అనుభవం ఎదురైంది. ఈ సినిమాకు రిలీజ్ ఖర్చులు కూడా రాలేదు ఆ దేశంలో. కేవలం రూ.7 కోట్లకు పరిమితమయ్యాయి వసూళ్లు. సినిమా రిలీజ్ ఆలస్యం కావడం వల్ల.. సరైన స్క్రీన్లు ఇవ్వకపోవడం వల్ల.. ఇంకేవో కారణాల వల్ల ఈ చిత్రం అక్కడ సరిగా ఆడలేదని అన్నారు నిర్మాతలు.

ఐతే ‘బాహుబలి: ది కంక్లూజన్’ విషయంలో ఇలాంటి పొరబాట్లు జరగనివ్వమని.. సరిగ్గా సినిమాను ప్రమోట్ చేసి.. ఎక్కువ టైం తీసుకోకుండా త్వరగా సినిమాను రిలీజ్ చేస్తామని.. ఈసారి రిజల్ట్ మారుతుందని అన్నాడు శోభు యార్లగడ్డ. ఐతే వీళ్ల కోరిక ఫలించేలా లేదు. అంతా అనుకున్న ప్రకారం జరిగితే ‘బాహుబలి-2’ ఈపాటికే చైనాలో విడుదల కావాల్సింది. కానీ వీళ్ల సన్నాహాల్లో వీళ్లుండగా.. భారత్-చైనా సంబంధాలు దెబ్బ తిన్నాయి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
చైనాలో కళ్లు చెదిరే వసూళ్లు రాబట్టి ‘దంగల్’ సినిమాను అక్కడ బాగా ఆడుతుండగానే తీసేశారు. తర్వాత వేరే ఇండియన్ సినిమాలు వేటికీ అనుమతులు ఇవ్వట్లేదు. ‘బాహుబలి-2’ రిలీజ్‌కు కూడా పర్మిషన్ రాలేదని సమాచారం. ఇప్పటికే ‘బాహుబలి: ది కంక్లూజన్’ ఇండియా సహా ప్రపంచ దేశాల్లో విడుదలై ఐదు నెలలు కావస్తోంది. ఇప్పటికే ఆలస్యమైందనుకుంటుంటే.. ఇంకా లేటైతే ఉన్న ఆసక్తి కూడా పోతుంది.

మరోవైపు డోక్‌లామ్ వివాదం నేపథ్యంలో అసలు ఇండియా అంటేనే మండిపోతున్నారు చైనీయులు. ఈ పరిస్థితుల్లో ఒక వేళ అనుమతి వచ్చినా ‘బాహుబలి-2’ను ఏమాత్రం ఆదరిస్తారన్నది ప్రశ్నార్థకమే. తొలి భాగాన్ని ఆదరించని వాళ్లు.. రెండో భాగం మీద మాత్రం ఏమాత్రం ఆసక్తి చూపిస్తారన్నదీ సందేహమే. ఈ తరహా సినిమాలు చైనీయులకు కొత్తేమీ కాదు. కాబట్టి ‘బాహుబలి-2’ కూడా చైనాలో అద్భుతాలేమీ చేస్తుందని ఆశించాల్సిన పని లేదేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు