32 కోట్లు పెడితే.. పది కోట్లు కూడా రాలేదు

32 కోట్లు పెడితే.. పది కోట్లు కూడా రాలేదు

'అఆ’ సినిమాతో కెరీర్లో తొలిసారి రూ.50 కోట్ల షేర్ క్లబ్బులో అడుగుపెట్టాడు యువ కథానాయకుడు నితిన్. అతడి స్థాయికి అది పెద్ద అచీవ్మెంటే. ఐతే ఇందులో నితిన్ కంటే కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ పాత్ర ఎక్కువన్న సంగతి వాస్తవం. అలాగే సమంతకు కూడా నితిన్‌తో సమానంగా క్రెడిట్ ఇవ్వాలి. ఐతే ‘లై’ సినిమా దర్శక నిర్మాతలు మాత్రం ఈ విషయాన్ని గ్రహించలేదేమో. నితిన్ రేంజి పెరిగిపోయిందనుకుని ‘లై’ మీద భారీగా ఖర్చు పెట్టేశారు. ఏకంగా రూ.32 కోట్ల బడ్జెట్లో తెరకెక్కిందీ సినిమా. సినిమాకు ఎంత మేరకు అవసరం అన్నది పక్కన పెడితే.. 75 రోజుల పాటు యుఎస్‌లోనే ఈ చిత్రాన్ని తీశారు. దీంతో బడ్జెట్ తడిసి మోపెడైంది. బిజినెస్ అనుకున్న స్థాయిలో జరగలేదు.

ఐతే విడుదల తర్వాత సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే.. బడ్జెట్ మొత్తం రికవరైపోతుందనుకున్నారు. కానీ మంచి కంటెంట్ ఉన్న సినిమాలా కనిపించిన ‘లై’ అంచనాల్ని అందుకోలేకపోయింది. ఇండిపెండెన్స్ డే వీకెండ్లో ఇంకో రెండు సినిమాలతో పోటీ పడి దెబ్బ తింది. ఓ వర్గం ప్రేక్షకులకు మాత్రమే నచ్చేలా ఉన్న ఈ సినిమాకు వసూళ్లు మరీ దారుణంగా వచ్చాయి. ఫుల్ రన్లో ఈ చిత్రం బడ్జెట్లో మూడో వంతు కూడా వసూలు చేయలేకపోయింది. కేవలం రూ.9.45 కోట్ల ఫుల్ రన్ షేర్‌తో చతికిలబడింది. గ్రాస్ రూ.17 కోట్లు వచ్చింది. అన్ని ఏరియాల్లోనూ బయ్యర్లకు భారీ నష్టాలు తప్పలేదు. నిర్మాతలకు కూడా పెద్ద పంచే పడింది. ఈ సినిమాకు రూ.25 కోట్ల మేర బిజినెస్ జరిగినట్లు సమాచారం. అందులో సగం కూడా వసూలవ్వలేదు. ఉన్నంతలో నైజాం ఏరియాలో రూ.3.2 కోట్లతో పర్వాలేదనిపించింది ‘లై’. మిగతా అన్ని చోట్లా నామమాత్రంగా వచ్చాయి వసూళ్లు. యుఎస్ ప్రేక్షకులు కూడా దీన్ని తిప్పి కొట్టారు. అక్కడ 2 లక్షల డాలర్లకు కొంచెం ఎక్కువ వసూలు చేసిందీ సినమా. మొత్తానికి ‘లై’ ఈ చిత్ర బృందంలో అందరి కెరీర్లకూ పెద్ద దెబ్బే వేసింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు