చైతూకు చెలగాటం.. నరేష్‌కు ప్రాణ సంకటం

చైతూకు చెలగాటం.. నరేష్‌కు ప్రాణ సంకటం

వారం గిర్రున తిరిగింది. మళ్లీ శుక్రవారం వచ్చేసింది. ఈ వీకెండ్లో ఒకటికి మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. అందులో ‘ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం’ అందరూ కొత్త వాళ్లతో తెరకెక్కిన సినిమా. ఈ చిన్న సినిమాను ప్రేక్షకులు ఏమాత్రం పట్టించుకుంటారన్నది సందేహమే. ఫోకస్ మిగతా రెండు సినిమాల మీద ఉంది. అందులో అక్కినేని నాగచైతన్య సినిమా ‘యుద్ధం శరణం’ ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుందనడంలో సందేహం లేదు. ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో పాజిటివ్ బజ్ ఉంది.

ప్రేమమ్, రారండోయ్ వేడుక చూద్దాం లాంటి సూపర్ హిట్ల తర్వాత నాగచైతన్య నటించిన సినిమా ఇది. పైగా ‘వారాహి చలనచిత్రం’ లాంటి పేరున్న బేనర్లో తెరకెక్కడం.. ఈ సినిమాకు సంబంధించిన ప్రోమోలు కూడా ఆసక్తి రేకెత్తించడం.. ప్రమోషన్ కూడా గట్టిగా చేయడంతో ‘యుద్ధం శరణం’ మంచి బజ్ తెచ్చుకుంది. దీనికి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బాగున్నాయి. హ్యాట్రిక్ కొట్టేందుకు ఉత్సాహంగా రంగంలోకి దిగుతున్నాడు చైతూ.

ఐతే అల్లరి నరేష్ పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నం. అతను ఐదేళ్లుగా హిట్టు ముఖం చూడలేదు. ఈ నేపథ్యంలో అతడి ఆశలన్నీ ‘మేడ మీద అబ్బాయి’ మీదే ఉన్నాయి. ఈ సినిమా హిట్టవడం నరేష్‌కు జీవన్మరణ సమస్య అనే చెప్పాలి. ఇప్పటికే బాగా దెబ్బ తిన్న అతడి కెరీర్, మార్కెట్.. ఈ సినిమా తేడా కొడితే మరింత ప్రమాదకర స్థితికి చేరుకుంటాయి. ఇలాంటి సమయంలో ‘యుద్ధం శరణం’ లాంటి క్రేజున్న సినిమాతో అల్లరోడి చిత్రం పోటీ పడటం కొంచెం ప్రమాదకరమే. ఐతే తన గత సినిమాలకు పూర్తి భిన్నంగా కొత్త తరహా కథతో వస్తున్నానని, ఈ సినిమాతో తన కెరీర్ సరైన దారిలోకి వస్తుందని నరేష్ ఆశాభావంతో ఉన్నాడు. మరి ఫ్రైడే వార్‌లో రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు