జగన్ ఇమేజ్ ను దారుణంగా దెబ్బ తీసేలా రఘురామ తాజా ప్లానింగ్

మెరుగైన వైద్యం కోసం.. అందునా ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందేందుకు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట నుంచి దేశ రాజధానికి వెళ్లిన నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ ఇప్పుడో అర్థం కాని ప్రశ్నగా మారారు. ఢిల్లీకి వెళ్లిన తర్వాత ఆరోగ్యం మీద శ్రద్ధ ఎంతన్నది పక్కన పెడితే.. తనను అరెస్టు చేసి.. జైలుకు పంపే క్రమంలో చోటు చేసుకున్న పరిణామాలకు బదులు తీర్చుకోవాలని మహా పట్టుదలతో ఉన్నట్లు కనిపిస్తోంది.

ఇందులో భాగంగా బీజేపీ పెద్దల్ని కలుస్తున్న ఆయన.. రాజ్ నాథ్ సింగ్ తో భేటీ కావటం.. ఆయన చెప్పేదంతా సావధానంగా వినటం తెలిసిందే. అనంతరం గుంటూరు రూరల్ ఎస్పీ అమ్మిరెడ్డికి స్థానచలనం అనుకోకుండా జరిగిందని అనుకోలేం. అయ్యగారికి మాంచి పోస్టింగ్ వేస్తారన్న వాదనలకు బదులుగా.. డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేయటం చాలామందికి జీర్ణించుకోలేని పరిస్థితి. ఈ ఉదంతానికి రఘురామకు ఏమైనా లింకు ఉందా? అంటే ఓపెన్ గా ఎవరూ అవునని చెప్పలేని పరిస్థితి.

జాతీయ మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించిన రఘురామ తాజాగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలవటం.. ఆయనతో అరగంటకు పైనే మాట్లాడినట్లుగా తెలుస్తోంది. ఆయన చెప్పిందంతా లోక్ సభ స్పీకర్ సావధానంగా విన్నట్లుగా చెబుతున్నారు. ఈ సందర్భంగా రఘురామ ఒక విన్నపాన్ని ఆయన ముందు ఉంచినట్లుగా చెబుతున్నారు. వచ్చే లోక్ సభ సమావేశం తొలి రోజున తన కేసుపై మాట్లాడే అవకాశాన్ని కల్పించాలని రఘురామ కోరినట్లుగా తెలుస్తోంది. దీనికి స్పీకర్ సానుకూలంగా స్పందించినట్లు చెబుతున్నారు.

ఒకవేళ అదే జరిగితే.. జాతీయ స్థాయిలో రఘురామ వ్యవహరం చర్చకు రావటమే కాదు.. తాను టార్గెట్ చేసిన వ్యక్తుల్ని మరింత ఇరుకున పెట్టాలన్నదే ఆయన ఉద్దేశంగా చెబుతున్నారు. సాధారణంగా ఒక ఎంపీని పోలీసులు అదుపులోకి తీసుకొని.. విచారణలో భాగంగా కొట్టారన్న మాటకు కనెక్టు కావటం ఖాయం. ఇదంతా చూస్తే.. జగన్ ఇమేజ్ ను దెబ్బ తీసేందుకు రఘురామ భారీ ప్లానింగ్ చేస్తున్నట్లుగా కనిపించక మానదు. మరేం జరుగుతుందో చూడాలి.