‘మోస్ట్ డిజైరబుల్’ సిత్రాలు


టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ ఏటా ‘మోస్ట్ డిజైరబుల్’ మెన్ అండ్ వుమెన్ లిస్టు ప్రకటిస్తుందన్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళం, హిందీ, ఇలా వేర్వేరు భాషలు, ప్రాంతాలకు ఈ లిస్ట్ ఇస్తుంటారు. తెలుగు ప్రాంతం విషయానికి వస్తే హైదరాబాద్ బేస్డ్‌గా ఈ జాబితాను ఇస్తుంటారు. ఈ లిస్ట్ ఇచ్చినపుడు సామాజిక మాధ్యమాల్లో బాగానే చర్చ జరుగుతుంటుంది. ఈ టాపిక్ ట్రెండింగ్‌లో ఉంటుంది. ఈసారి కూడా అందుకు భిన్నమేమీ కాదు. ప్రతిసారీ లాగే ఈ సారి కూడా ఈ జాబితాలో కొన్ని సిత్రాలు చోటు చేసుకున్నాయి.

ఈసారి ఈ జాబితాలో మహేష్ బాబు, ప్రభాస్ లాంటి వాళ్లు కనిపించకపోవడం ఆశ్చర్యపరిచింది. ఐతే వీళ్లిద్దరినీ పరిగణనలోకి తీసుకుంటే ప్రతిసారీ టాప్‌ ప్లేసుకు పోటీలో ఉంటారు కాబట్టి.. ఈ ఇద్దరినీ వార్షిక పోటీకి పరిగణించకుండా ‘ఫరెవర్ డిజైరబుల్’ లిస్టులో పెట్టేశారట. సీనియర్ హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ ముందు నుంచి ఈ జాబితాలో ఉన్నారు. గత ఏడాది మహేష్ బాబును ఇందులోకి చేర్చగా.. ఈసారి ప్రభాస్ అందులోకి వెళ్లాడు.

ఇక వార్షిక జాబితాను పరిశీలిస్తే.. విజయ్ దేవరకొండ వరుసగా రెండో ఏడాది అగ్రస్థానంలో ఉండటంలో ఆశ్చర్యం లేదు కానీ.. ఈ జాబితాలోకి అతడి తమ్ముడు ఆనంద్ దేవరకొండ రావడమే చాలామందికి అర్థం కావడం లేదు. పైగా అతను 21వ స్థానంలో ఉంటే.. అడివి శేష్ (22), నితిన్ (25) నాని (26) తనకంటే దిగువన ఉన్నారు. ఆనంద్‌లో పోలిక పక్కన పెడితే.. శేష్, నితిన్, నాని ఇంత దిగువన ఉండటం సమంజసంగా అనిపించడం లేదు. అల్లు అర్జున్ కూడా 17వ స్థానానికి పరిమితం కావడం అభిమానులకు జీర్ణం కావడం లేదు. రామ్, నాగశౌర్య, సందీప్ కిషన్‌లను వరుసగా 2, 5, 9 స్థానాల్లో పెట్టి.. పైన చెప్పుకున్న హీరోలను కింద పడేయడం వారి అభిమానులకు నచ్చట్లేదు.