బాహుబలి’ లాగే ‘అర్జున్ రెడ్డి’ కూడా..

బాహుబలి’ లాగే ‘అర్జున్ రెడ్డి’ కూడా..

ఎప్పుడూ తమిళ సినిమాల్ని తెలుగు ప్రేక్షకులు.. ఇండస్ట్రీ జనాలు నెత్తిన పెట్టుకోవడమే తప్ప మన సినిమాల్ని వాళ్లు గుర్తించడం.. పొగడ్డం జరిగేది కాదు ఒకప్పుడు. కానీ గత కొన్నేళ్లలో పరిస్థితి మారిపోయింది. తెలుగు సినిమాలు చూసి తమిళ జనాలు కూడా ఫిదా అయిపోతున్నారు.

మన సినిమాల గొప్పదనాన్ని గుర్తిస్తున్నారు. మన సినిమాల నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం గురించి బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ విషయంలో 'బాహుబలి' పెద్ద ముందడుగు వేసింది. ఆ సినిమాను తమిళ జనాలు ఎంతగా కొనియాడారో తెలిసిందే. 'బాహుబలి' రెండు భాగాల మీదా కోలీవుడ్ జనాలు ప్రశంసలు కురిపించారు. 'ఘాజీ' విషయంలోనూ కోలీవుడ్ జనాలు బాగానే స్పందించారు.

ఇప్పుడు 'అర్జున్ రెడ్డి' సైతం కోలీవుడ్‌లో కలకలం రేపుతోంది. పైన చెప్పుకున్న రెండు సినిమాలూ తమిళంలోకి అనువాదమై అక్కడి వాళ్లను ఆకట్టుకుని.. ప్రశంసలు పొందితే.. 'అర్జున్ రెడ్డి' మాత్రం తెలుగు వెర్షన్ తోనే వాళ్లను కట్టిపడేస్తోంది. తమిళ పరిశ్రమకు చెందిన అనేకమంది ప్రముఖులు 'అర్జున్ రెడ్డి' డైరెక్ట్ తెలుగు వెర్షన్ చూసి ఫిదా అయిపోవడం విశేషం. 'తనీ ఒరువన్' లాంటి బ్లాక్ బస్టర్ తీసిన మోహన్ రాజా 'అర్జున్ రెడ్డి' గురించి స్పందిస్తూ.. ఈ సినిమా గురించి తన తండ్రి పొగిడిన తీరుకు ఆశ్చర్యపోయానని.. ఇలాంటి ప్రశంసలు తాను కూడా తన తర్వాతి సినిమాతో అందుకోవాలనిపిస్తోందని.. ఈ సినిమా అద్భుతమని అన్నాడు.

ఇక 'నానుమ్ రౌడీ దా'తో సూపర్ హిట్ కొట్టి.. ప్రస్తుతం సూర్యతో 'తానా సేంద్ర కూట్టమ్' సినిమా చేస్తున్న విఘ్నేష్ శివన్ స్పందిస్తూ.. విజయ్ సూపర్ స్టార్ అని.. యాక్టింగ్ అంటే ఇదీ అని వ్యాఖ్యానించాడు. అరవింద్ స్వామి సైతం 'అర్జున్ రెడ్డి'పై ప్రశంసలు కురిపించాడు. ఇంకా మరిందరు కోలీవుడ్ ప్రముఖులు 'అర్జున్ రెడ్డి'ని ఆకాశానికెత్తేశారు. ప్రముఖ క్రిటిక్ శ్రీధర్ పిళ్లై కూడా 'అర్జున్ రెడ్డి'ని కొనియాడాడు. 'అర్జున్ రెడ్డి' చూసి ఫిదా అయిపోయిన ధనుష్.. ఆ చిత్ర రీమేక్ హక్కులు తీసుకుని.. తనే హీరోగా సినిమాను నిర్మించడానికి ముందుకొచ్చినట్లు సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English