చాలామంది చెప్పారు.. అందుకే మారా

చాలామంది చెప్పారు.. అందుకే మారా

ఒకప్పుడు అల్లరి నరేష్ హవా ఎలా ఉండేదో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అతడి ఫ్లాప్ సినిమా కూడా సేఫ్ జోన్లో ఉండేది. తక్కువ బడ్జెట్లో సినిమాలు తీస్తూ.. అప్పుడప్పుడూ ఓ హిట్టు ఇస్తూ.. ఎప్పుడూ అరడజను కమిట్మెంట్లతో.. ఏడాదిలో మూణ్నాలుగు రిలీజ్‌లతో బిజీగా ఉండేవాడు నరేష్.

అలాంటి వాడికి ఇప్పుడు అవకాశాలు కరవయ్యాయి. ఐదేళ్లుగా అతను హిట్టు ముఖమే చూడలేదు. జబర్దస్త్ లాంటి కామెడీ షోలతో బుల్లితెరలోనే బోలెడంత వినోదం అందుతుండటంతో నరేష్ చేసే రొటీన్ కామెడీ సినిమాలు జనాలకు ఆనట్లేదు. అతడి స్పూఫులు, పేరడీలకు కాలం చెల్లిపోయింది. వరుసగా ఫ్లాపులు ఎదురవుతున్నా.. నరేష్ సినిమాల తీరు మారకపోవడంతో దారుణమైన ఫలితాలు ఎదురయ్యాయి.

ఐతే గతంలో తాను తప్పులు చేసిన మాట వాస్తవమే అని.. ఇప్పుడు మాత్రం మారానని అల్లరి నరేష్ నొక్కి వక్కాణిస్తున్నాడు. తన కొత్త సినిమా 'మేడ మీద అబ్బాయి' కచ్చితంగా ప్రేక్షకులకు కొత్త అనుభూతి పంచుతుందని నరేష్ చెప్పాడు. ''ఇన్నాళ్లూ ఒకే తరహా కామెడీ సినిమాలు చేస్తూ వచ్చాను. నా అభిమానులు, శ్రేయోభిలాషులు, సినీ పెద్దలు ట్రాక్ మార్చమని చెప్పాడు. ఆ క్రమంలోనే 'మేడ మీద అబ్బాయి' చేశాను.

ఈ సినిమాతో ఇక నా దగ్గరికి కొత్త కథలు వస్తాయని ఆశిస్తున్నా. ఇన్నాళ్లూ నన్ను ఒక ఫ్రేమ్‌లో పెట్టి కథలు రాసిన రచయితలు, దర్శకులు ఇకపై భిన్నమైన కథలతో నా దగ్గరికి వస్తారని ఆశిస్తున్నా'' అని నరేష్ అన్నాడు. 'మేడ మీద అబ్బాయి' ప్రి రిలీజ్ ఈవెంట్లో నరేష్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈ వేడుకకు అతిథిగా వచ్చిన నరేష్ స్నేహితుడు నాని మాట్లాడుతూ.. రొటీన్ కామెడీ సినిమాలు మానుకుని, డిఫరెంట్‌గా ట్రై చేయమని తాను కూడా నరేష్‌కు సలహా ఇచ్చానని.. అతను 'మేడ మీద అబ్బాయి' లాంటి వైవిధ్యమైన సినిమా చేయడం హ్యాపీ అని.. ఇక అతడి కెరీర్ సరైన దారిలో వెళ్తుందని ఆశిస్తున్నానని చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు