ఉంగరాల బాబు.. ఎప్పుడొస్తే ఏంటి?

ఉంగరాల బాబు.. ఎప్పుడొస్తే ఏంటి?

ఉంగరాల రాంబాబు.. ఎప్పుడో ఏడాది కిందట మొదలైన సినిమా ఇది. సినిమా పూర్తయి కూడా చాలా నెలలైంది. కానీ ఇప్పటిదాకా విడుదలకు నోచుకోవడం లేదు. 'ఓనమాలు'.. 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' లాంటి మంచి సినిమాలు చేసిన క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించిన సినిమా ఇది. కానీ ఈ సినిమా ప్రోమోలు చూస్తే మాత్రం ఇది క్రాంతి మాధవ్ మార్కు సినిమాలా ఎంతమాత్రం కనిపించలేదు.

అతను తన శైలిని విడిచిపెట్టి.. సునీల్ టేస్టుకు తగ్గ సినిమానే చేసినట్లున్నాడు. వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నా.. మాస్ ఇమేజ్ కోసం సునీల్ వెంపర్లాట కొనసాగుతున్నట్లే కనిపించింది ఈ సినిమా ప్రోమోలు చూస్తే. అందుకే ఈ సినిమాపై అటు ట్రేడ్ వర్గాల్లో కానీ.. ఇటు ప్రేక్షకుల్లో కానీ ఎలాంటి ఆసక్తి కలగలేదు.

ఈ చిత్ర నిర్మాత పెట్టుకున్న టార్గెట్ కు తగ్గట్లుగా బిజినెస్ జరక్కపోవడంతో సినిమా నెలల తరబడి వాయిదాలు పడుతూ వచ్చింది. మరోవైపు సోలో రిలీజ్.. సోలో రిలీజ్ అంటూ వెయిట్ చేయడం వల్ల కూడా విడుదల ఆగుతూ వచ్చింది. ఐతే ఎలాంటి బజ్ లేని ఇలాంటి సినిమా వేరే సినిమాలతో పోటీ పడినా.. సోలోగా వచ్చినా పెద్దగా తేడా ఏమీ ఉండదంటున్నారు ఇండస్ట్రీ జనాలు. సినిమాను అయినకాడికి అమ్మేసి.. అమ్ముడవని ఏరియాల్లో సొంతంగా రిలీజ్ చేసుకోవాలన్న ఆలోచనకు వచ్చిన నిర్మాత.. చివరికి సెప్టెంబరు 15న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ఫిక్సయ్యాడు.

ఐతే ముందు వారం 'యుద్ధం శరణం'తో పాటు ఇంకో రెండు సినిమాలు దిగుతున్నాయి. తర్వాతి వారం 'జై లవకుశ' లాంటి క్రేజీ మూవీ వస్తోంది. వీటి మధ్య రానున్న 'ఉంగరాల రాంబాబు' ఏమాత్రం నిలుస్తుందన్నది డౌటు. ఈ సినిమాకు సోలో రిలీజ్ ఛాన్స్ లేకుండా ఇంకో సినిమా రేసులోకి దిగే అవకాశాలు కూడా లేకపోలేదు. మొత్తానికి ఏ రకంగా చూసినా 'ఉంగరాల రాంబాబు'కు బ్యాండు తప్పేలా లేదు. మరి ఈ సినిమా ఎలా నెట్టుకొస్తుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు