హృతిక్ పరువు తీసేసింది

హృతిక్ పరువు తీసేసింది

కేసులు వెనక్కి తీసుకున్నారు. వివాదం సద్దుమణిగింది. ఇక ఎవరి పనుల్లో వాళ్లు మునిగిపోవడంతో హృతిక్ రోషన్-కంగనా రనౌత్ గొడవ ముగిసిన కథే అనుకున్నారంతా. కానీ కంగనా వెనక్కి తగ్గితేనా..? తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె హృతిక్ రోషన్ ఇమేజ్‌ను దారుణంగా దెబ్బ తీసేలా సంచలన వ్యాఖ్యలు చేసింది. తమ మధ్య ప్రేమాయణం.. బ్రేకప్.. గొడవ గురించి కూలంకషంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడేసింది. ఆమె చెప్పిందంతా వింటే హృతిక్ ఇంతటి నీచుడా అని జనాలకు అనిపిస్తే ఆశ్చర్యమేమీ లేదు. నిజాల్ని నిక్కచ్చిగా మాట్లాడుతుందన్న పేరుకు కంగనాకు ఉన్న నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలు హృతిక్‌కు మామూలుగా డ్యామేజ్ చేయవనే చెప్పాలి. 

హృతిక్‌కు భార్య (సుసానే) ఉన్నప్పటికీ తానంటే ఇష్టపడ్డాడని తాను కూడా మనస్ఫూర్తిగా అతడిని ప్రేమించానని.. కానీ అతను మాత్రం కుటుంబ పరిస్థితుల దృష్ట్యా తన భార్యను వదిలి ఉండలేనని.. అలాగని తననూ వదులుకోలేననని చెప్పాడని.. తన గురించి బయటి ప్రపంచానికి మాత్రం చెప్పలేనని చెప్పాడని కంగనా వెళ్లడించింది. ఇది తనకు నచ్చక తనను మర్చిపొమ్మని చెప్పాననని.. అందుకే 'క్రిష్‌ 3'లో చేయమన్నపుడు కూడా నో చెప్పానని.. ఐతే హృతిక్ మాత్రం నాలుగు నెలలు ఒత్తిడి చేసి మరీ తాను అందులో నటించేందుకు ఒప్పించాడని కంగనా వెల్లడించింది.

హృతిక్ భార్య అతడిని వదిలేసి వెళ్లిపోయాక విడాకుల కేసు ముగిశాక తమ బంధం గురించి అందరికీ చెబుతానని హృతిక్ తనతో అన్నాడని.. ఐతే కొన్నాళ్ల తర్వాతో మరో నటితో హృతిక్ సన్నిహితంగా ఉన్నట్లు వార్తలొచ్చాయని.. దీని గురించి తాను ఫోన్ చేసి అడిగానని, అలాగే ప్రేమికుల దినోత్సవం నాడు తనకెందుకు ఫోన్ చేయలేదని అడిగితే.. నీకెందుకు ఫోన్ చేయాలి, మన మధ్య అలాంటి బంధమేదీ లేదు కదా, నన్ను మర్చిపో అంటూ తేలిగ్గా మాట్లాడటంతో తాను బాధతో కుంగిపోయినట్లు కంగనా తెలిపింది.

ఆ తర్వాత 'క్వీన్' సినిమా ఘనవిజయం సాధించడంతో ఫోన్ చేసి 'నిన్ను చూస్తే నాకు గర్వంగా ఉంది. నన్ను క్షమించు' అని హృతిక్ అడిగాడని.. తాను తమ బంధం గురించి అడిగితే మాత్రం 'క్వీన్' తర్వాత నీకు పొగిరెక్కిందంటూ మాట్లాడాడని చెప్పింది. అప్పుడే తాను ఇక హృతిక్‌తో బంధం వద్దనుకున్నానని.. ఆ విషయాన్నే ఓ ఇంటర్వ్యూలో బహిరంగంగా చెప్పానని.. ఆ తర్వాత తనకు బెదిరింపులు మొదలయ్యాయని.. హృతిక్ గురించి తాను రాసిన కవితల్ని బయటపెట్టడంతో పాటు నా ప్రైవేట్ ఫొటోలు, వీడియోలు ఇంటర్నెట్లో వైరల్ చేస్తామంటూ బెదిరించాడని.. దీనిపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేయగా.. వాళ్లను కూడా కొనేసి తనకు న్యాయం జరగకుండా చేశారని కంగనా వెల్లడించింది. ఓ నటి కూడా హృతిక్ తరఫున నాతో మాట్లాడి.. వెనక్కి తగ్గకపోతే చచ్చిపోతావంటూ బెదిరించినట్లు కంగనా చెప్పడం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు