ఒక్క పాటకు 32 కోట్లు

ఒక్క పాటకు 32 కోట్లు

దక్షిణాదినే కాదు.. ఇండియాలో ఏ భాషలో అయినా రూ.32 కోట్లు పెట్టి సినిమా తీస్తే దాన్ని పెద్ద బడ్జెట్ సినిమా అనే అంటారు. అలాంటిది కేవలం ఒక పాటకు మాత్రమే రూ.32 కోట్లు ఖర్చు పెడితే దాని గురించి ఏం మాట్లాడాలి? ఇండియా అనే కాదు.. ప్రపంచంలో ఎక్కడైనా కూడా రూ.32 కోట్లు పెట్టి ఒక పాట తీసి ఉండకపోవచ్చేమో.

అసలు ఇండియాలో తప్ప ఇంకెక్కడా పాటలు ఉండవు కాబట్టి ఇదే ప్రపంచ సినీ చరిత్రలో కాస్ట్లీయెస్ట్ పాట అని చెప్పొచ్చు. ఈ ఘనత '2.0' టీంకే చెందనుంది. తన సినిమాల్లో పాటలకు భారీగా ఖర్చు చేయడం అలవాటైన శంకర్.. ఈ సినిమాలో ఒక పాటకు ఏకంగా రూ.32 కోట్లు ఖర్చు పెట్టించేశారట.

ప్రపంచ స్థాయి సాంకేతిక నైపుణ్యాన్ని వినియోగిస్తూ భారీ స్థాయిలో రోబోలను చూపిస్తూ.. వాటి మధ్య రజినీ-అమీ జాక్సన్‌ల మీద ఈ పాట తీసినట్లు సమాచారం. ఇప్పటిదాకా 'ధూమ్-3' సినిమాలోని ఒక పాటకు రూ.5 కోట్లు ఖర్చు చేయడమే ఇప్పటిదాకా రికార్డు. దానికి ఆరు రెట్లకు పైగా ఖర్చుతో '2.0'లో ఒక పాటను చిత్రీకరించాడట శంకర్.

ఈ పాట కళ్లు చెదిరిపోయేలా ఉంటుందని.. ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని పంచుతుందని అంటున్నారు. ఈ సినిమా కోసం సంగీత దర్శకుడు రెహమాన్ ఐదు పాటలు రికార్డ్ చేసినప్పటికీ.. సినిమాలో కనిపించేది రెండు పాటలేనట. మిగతా పాటలూ పెడితే నిడివి పెరిగిపోతుందని భావించి.. రెండు పాటలకే పరిమితం చేశాడట శంకర్. ఆ రెండు పాటలూ కూడా అద్భుత రీతిలో ఉండేలా శంకర్ చిత్రీకరించాడట. ఈ చిత్రం జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు