డిజాస్టర్ హీరో.. 243 కోట్లు సంపాదించాడు

డిజాస్టర్ హీరో.. 243 కోట్లు సంపాదించాడు

షారుఖ్ ఖాన్ లేటెస్ట్ మూవీ ‘జబ్ హ్యారీ మెట్ సెజాల్’ ఎత పెద్ద డిజాస్టరో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. దీనికి ముందు షారుఖ్ నుంచి వచ్చిన ‘రయీస్’ కూడా ఫ్లాప్ సినిమానే. దానికి ముందు వచ్చిన ‘హీరో’ కూడా డిజాస్టరే. దానికి ముందు సినిమా ‘దిల్ వాలే’ కూడా ఈ జాబితాలోని సినిమానే. ఐతే తన సినిమాల ఫలితాలు ఎలా ఉంటేనేం.. షారుఖ్‌కు మాత్రం పారితోషకాల విషయంలో ఢోకానే లేదు.

2016 జూన్ 1 నుంచి ఈ ఏడాది జూన్ 1 లోపు షారుఖ్ తన సినిమాలకు అందుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే కళ్లు తిరుగుతాయి. ఏకంగా రూ.243 కోట్లు అందుకున్నాడట కింగ్ ఖాన్. ఫోర్బ్స్ సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది.

ఫోర్బ్స్ ఈ ఏడాది కాలంలో ఇండియాలో అత్యధిక పారితోషకం అందుకున్న నటీనటుల జాబితా విడుదల చేయగా.. షారుఖ్ రూ.243 కోట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ లిస్టులో సల్మాన్ ఖాన్ రెండో స్థానంలో నిలిచాడు. అతడికి.. షారుఖ్ కు తేడా రూ.7 కోట్లే కావడం విశేషం. అతను రూ.236 కోట్లతో రెండో స్థానం సాధించాడు. సక్సెస్‌ల విషయంలో వీళ్లకు అందనంత ఎత్తులో ఉన్న అమీర్ ఖాన్ మాత్రం కేవలం రూ.80 కోట్లతో నాలుగో స్థానానికి పరిమితమయ్యాడు.

అతను గత రెండేళ్ల కాలంలో ఒక్క ‘దంగల్’ సినిమా మాత్రమే చేశాడు. కానీ షారుఖ్.. సల్మాన్ ఎక్కువ సినిమాలు చేయడం.. పారితోషకంతో పాటు లాభాల్లో కూడా వాటా కూడా తీసుకోవడంతో అతడికి అందనంత ఎత్తులో నిలిచారు. విశేషం ఏంటంటే.. ఈ జాబితాలో అక్షయ్ కుమార్ రూ.224 కోట్లతో మూడో స్థానంలో నిలిచాడు. అమీర్ తర్వాతి స్థానాల్లో హృతిక్ రోషన్ (రూ.73.6 కోట్లు).. దీపికా పదుకొనే (రూ.70 కోట్లు).. రణ్వీర్ సింగ్ (రూ.64 కోట్లు).. ప్రియాంక చోప్రా (రూ.63 కోట్లు).. అమితాబ్ బచ్చన్ (రూ.57 కోట్లు).. రణబీర్ కపూర్ (రూ.54 కోట్లు) టాప్-10లో నిలిచారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English