నాగశౌర్య-సాయిపల్లవి.. కణం

నాగశౌర్య-సాయిపల్లవి.. కణం

తెలుగబ్బాయి నాగశౌర్య హీరో.. మలయాళ అమ్మాయి సాయిపల్లవి హీరోయిన్.. ‘నాన్న’ ఫేమ్ ఎ.ఎల్.విజయ్ దర్శకుడు.. ‘2.0’ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్న లైకా ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ.. ఇలాంటి ఒక విలక్షణమైన కాంబినేషన్లో తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా తెరకెక్కుతోంది. తమిళంలో ఆ చిత్రానికి ‘కారు’ అని పేరు పెట్టారు.

కొన్ని నెలల కిందటే దీని ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. ఒక వలయం లోపల ఒక చిన్నారిని పట్టుకుని సాయిపల్లవి పడుకుని ఉన్న చిత్రమది. చాలా వెరైటీగా.. పొయెటిగ్గా అనిపించింది ఈ ఫస్ట్ లుక్. ఇప్పుడు ఈ చిత్ర తెలుగు టైటిల్ ప్రకటిస్తూ ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

తెలుగులో ఈ చిత్రానికి ‘కణం’ అని పేరు పెట్టారు. టైటిల్లో సున్నా ఉన్న చోట తల్లిగర్భంలోని బిడ్డను పెట్టారు. దీన్ని బట్టి ఇది ఒక బిడ్డ చుట్టూ తిరిగే కథ అని భావించవచ్చు. దర్శకుడు ఏం చెప్పాలనుకున్నది అర్థం కాలేదు కానీ.. సినిమా అయితే వైవిధ్యంగా ఉండబోతోందని అర్థమవుతోంది. సాయిపల్లవి ‘ఫిదా’ సినిమాతో తెలుగులో సూపర్ పాపులారిటీ సంపాదించిన నేపథ్యంలో ఈ సినిమాకు ఆమె పెద్ద ప్లస్ అవుతుందని భావిస్తున్నారు.

ఇప్పటికే తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న నాగశౌర్య ఒక పెద్ద బేనర్లో ఎ.ఎల్.విజయ్ లాంటి ప్రముఖ దర్శకుడి చేతుల మీదుగా తమిళ ప్రేక్షకులకు పరిచయం కాబోతుండటం విశేషమే. ఈ చిత్రంలో ‘పెళ్లిచూపులు’ ఫేమ్ ప్రియదర్శి కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు