అమితాబ్ మీద ఆ కోపంతోనేనా..?

అమితాబ్ మీద ఆ కోపంతోనేనా..?

అమితాబ్ బచ్చన్.. దేశంలో అత్యంత గౌరవనీయమైన సినీ నటుడు. హిందీ వాళ్లే కాదు.. ఇతర భాషల వాళ్లు కూడా ఆయన్ని అభిమానిస్తారు. ఆరాధిస్తారు. కేవలం నటుడిగానే కాకుండా అనేక రకాలుగా గౌరవం సంపాదించుకున్నాడు అమితాబ్. అలాంటి వ్యక్తిని పట్టుకుని రాజకీయాల్లోకి వచ్చి ఏం పీకాడు అంటూ చాలా తీవ్రమైన పదజాలమే వాడేశాడు నందమూరి బాలకృష్ణ.

అమితాబ్ రాజకీయాల్లోకి వచ్చి సాధించింది పెద్దగా ఏమీ లేదంటూ తన అభిప్రాయాన్ని బాలయ్య వ్యక్తం చేయడంలో తప్పు లేదు. కానీ తన ఉద్దేశాన్ని చెప్పే క్రమంలో నోరు జారి.. వివాదంలో చిక్కుకున్నాడు. చిరంజీవిని కూడా తేలిక చేసి మాట్లాడినప్పటికీ.. అమితాబ్ విషయంలో వాడిన పదజాలం మాత్రం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. దీన్ని అందరూ తప్పుబడుతున్నారు.

ఐతే బాలయ్య ఒక రకమైన కోపంతోనే అమితాబ్‌ను అంత మాట అన్నట్లుగా తెలుస్తోంది. కొన్ని నెలల కిందట బాలయ్య.. 'సర్కార్-3' సెట్స్‌కు వెళ్లి అమితాబ్‌ను కలిసిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఆ సమయంలో అమితాబ్‌కు పాదాభివందనం కూడా చేశాడు బాలయ్య. కృష్ణవంశీ దర్శకత్వంలో చేయాలనుకున్న 'రైతు' సినిమాలో ఓ కీలక పాత్రలో నటించమని అడిగేందుకే అమితాబ్ దగ్గరికెళ్లాడు బాలయ్య. కానీ ఆయన ఆ పాత్ర చేయడానికి అంగీకరించలేదు.

అమితాబ్ చేస్తే తప్ప ఆ సినిమా చేయనంటూ భీష్మించుకు కూర్చున్నాడు బాలయ్య. ఐతే తన సినిమాకు నో అన్న అమితాబ్.. చిరంజీవి సినిమా 'సైరా నరసింహారెడ్డి'కి మాత్రం ఓకే చెప్పడం బాలయ్యకు ఆగ్రహం తెప్పించినట్లు తెలుస్తోంది. ఆ కోపాన్ని తాజా ఇంటర్వ్యూలో మరో రకంగా చూపించేసినట్లున్నాడు బాలయ్య. ఐతే అమితాబ్ మీద అంత కోపం ఉన్నపుడు ఆయన చేయకుంటే ఏమైందిలే అనుకుని మరో నటుడిని ఆ పాత్రకు ఎంచుకుని, 'రైతు' సినిమా చేసేసి ఉండొచ్చు కదా బాలయ్య?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు