ఈ దెబ్బ నుంచి డైరెక్టర్‌ కోలుకుంటాడా?

ఈ దెబ్బ నుంచి డైరెక్టర్‌ కోలుకుంటాడా?

కృష్ణవంశీకి గతంలో కూడా శ్రీ ఆంజనేయంలాంటి చిత్రాలతో చేతులు కాలాయి కానీ అప్పట్లో తన సినిమాలకి క్రేజ్‌ వుండడంతో ఏ సమస్య లేకుండా అమ్ముడైపోయాయి. దీంతో తన ఫ్లాప్‌ సినిమాలతో కృష్ణవంశీకి దివాలా తీసే స్థాయి నష్టాలు రాలేదు. కానీ నక్షత్రంతో మాత్రం ఈ దర్శకుడి పరిస్థితి చాలా దారుణంగా తయారైందని గుసగుసలు వినిపిస్తున్నాయి. 

ఇరవై కోట్ల పైగా బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రానికి అన్నీ కలుపుకుని రికవరీ ఏడు కోట్లు కూడా రాలేదట. పది కోట్లలో ఈ చిత్రాన్ని తీసేస్తానంటూ కృష్ణవంశీ రంగంలోకి దిగాడట. సందీప్‌ కిషన్‌ తన పారితోషికం కంటే చాలా తక్కువ తీసుకోగా, ప్రకాష్‌రాజ్‌, సాయిధరమ్‌ తేజ్‌ తదితరులు ఫ్రీగానే నటించారట.

నటీనటులు అందరూ తమ పారితోషికాల పరంగా చాలా వదులుకున్నప్పటికీ చాలా కాలం పాటు నిర్మాణంలో వున్న ఈ చిత్రానికి బడ్జెట్‌ అనుకున్న దానికి రెండింతలు పైగా అయిందట. మధ్యలో ఇక షూటింగ్‌ చేయడం తన వల్ల కాదని నిర్మాత చేతులెత్తేస్తే కృష్ణవంశీ సొంత డబ్బు తెచ్చి పూర్తి చేసాడట. సినిమా అమ్ముడుపోతుందని ఆశిస్తే అది జరగలేదు.

దీంతో మొత్తం రిస్కు తీసుకుని స్వయంగా రిలీజ్‌ చేస్తే మొదట కొనడానికి వచ్చిన ఆఫర్ల కంటే చాలా తక్కువ రికవర్‌ అయింది. సొంత డబ్బు ఆరు కోట్లతో పాటు మరికొన్ని పూచీకత్తులు కూడా వున్న కృష్ణవంశీ దీంతో బాగా మునిగిపోయాడని, వెంటనే మరో సినిమా తీసి హిట్‌ కొడితే తప్ప మళ్లీ కోలుకోవడం కష్టమనీ చెప్పుకుంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు