30 కోట్ల సినిమా 4 కోట్లు తెచ్చింది

30 కోట్ల సినిమా 4 కోట్లు తెచ్చింది

కృష్ణవంశీ పారితోషకం తీసుకోలేదు. సాయిధరమ్ ఫ్రీగా చేశాడు. ఇంకా మరికొందరు ఉచిత సేవలు చేశారు. హీరోయిన్లు రెజీనా కసాండ్రా, ప్రగ్యా జైశ్వాల్ మామూలుగా తీసుకునేదాంట్లో నాలుగో వంతే పుచ్చుకున్నారట. ఇన్ని మినహాయింపులున్నా సరే.. ‘నక్షత్రం’ బడ్జెట్ రూ.30 కోట్లకు చేరినట్లుగా చెప్పుకున్నాడు కృష్ణవంశీ.

మరి ఈ సినిమాకు బిజినెస్ ఎంత జరిగిందో ఏమో కానీ.. వసూళ్లు మాత్రం పెట్టుబడిలో కనీసం 15 శాతం కూడా రాలేదు. ఈ చిత్రం ఫుల్ రన్లో కేవలం రూ.4.16 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేయడం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో రూ.3.93 కోట్ల షేర్ తెచ్చుకున్న ఈ సినిమా మిగతా అన్ని ఏరియాల్లో కలిపి రూ.23 లక్షలు మాత్రమే వసూలు చేసింది.

పెద్ద తారాగణమే ఉన్నప్పటికీ ఓవర్సీస్‌లో ‘నక్షత్రం’ సినిమాకు మరీ నామమాత్రంగా రూ.3 లక్షల వసూళ్లు మాత్రమే రావడం గమనార్హం. దీన్ని బట్టి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలున్నాయన్నది అర్థమవుతుంది. అంత తక్కువ అంచనాలతో థియేటర్లకు వెళ్లినా తీవ్ర నిరాశ తప్పలేదు. కనీస ఓపెనింగ్స్ కూడా రాని ఈ సినిమా వీకెండ్లోనే తేలిపోయింది. కృష్ణవంశీ కెరీర్లోనే ఆల్ టైం డిజాస్టర్‌గా ఈ సినిమాను చెప్పొచ్చేమో.

ఎప్పుడూ తన సినిమాల గురించి అతిగా చెప్పుకోని కృష్ణవంశీ.. ‘నక్షత్రం’ విషయంలో తాను నూటికి నూరు శాతం కాన్ఫిడెంట్‌గా ఉన్నట్లుగా స్టేట్మెంట్ ఇచ్చాడు. ‘గోవిందుడు అందరివాడేలే’ లాంటి యావరేజ్ తర్వాత మంచి హిట్టు కొట్టి ఫామ్ చాటుకుంటాడని అనుకుంటే.. తన కెరీర్లోనే అత్యంత చెత్త సినిమా తీసి.. ఇండస్ట్రీ నుంచి అంతర్ధానమైపోయే పరిస్థితికి వచ్చాడు ఒకప్పటి క్రియేటివ్ డైరెక్టర్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు