'బాహుబలి'కి అందకుండా పోతోంది

 'బాహుబలి'కి అందకుండా పోతోంది

ఒక ఇండియన్‌ సినిమా కోసం దేశ దేశాల్లోని సినీ ప్రియులు ఎదురు చూడడమనేది ఎప్పుడూ లేదు. ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీ నుంచి కొన్ని గొప్ప సినిమాలు వచ్చాయి కానీ ప్రపంచ వ్యాప్తంగా హాలీవుడ్‌ చిత్రాలు రేకెత్తించే ఆసక్తి కలిగించడంలో ఇంతకుముందు ఏవీ సక్సెస్‌ అవలేదు. ఒక్క చైనాలోనే ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసిన దానికి మించి వసూలు చేసిన అమీర్‌ఖాన్‌ 'దంగల్‌' ఇండియన్‌ సినిమా ప్రైడ్‌గా అవతరిస్తోంది.

చైనాలో అంతటి ఘన విజయాన్ని అందుకోవడంతో ఆసియాలోని ఇతర దేశాలు కూడా దంగల్‌పై ఆసక్తి చూపిస్తున్నాయి. హాంకాంగ్‌లో గత వారం విడుదలైన దంగల్‌కి అప్పుడే అక్కడ ఆరు మిలియన్లకి పైగా హాంకాంగ్‌ డాలర్లు వసూలయ్యాయి. అయిదు కోట్లకి పైగా వసూళ్లు సాధించిన దంగల్‌కి స్క్రీన్లు పెంచుతున్నారు. ఇది ఇప్పట్లో ఆగదని, మరింత పెద్ద స్థాయికి వెళుతుందని అక్కడి ట్రేడ్‌ నిపుణులు చెబుతున్నారు. అలాగే టర్కీలోను విడుదలైన దంగల్‌ అక్కడ రిలీజ్‌ అయిన తొలి భారతీయ సినిమాగా రికార్డుకెక్కింది. కోటి రూపాయలకి పైగా గ్రాస్‌ వసూలు చేసి అక్కడా బెంచ్‌మార్క్‌ సెట్‌ చేస్తోంది. జపాన్‌, కొరియాలో కూడా విడుదల చేయాలనే డిమాండ్‌ బాగా వుంది.

బాహుబలి 2 ఇంకా చైనాలో విడుదల కాలేదు. చైనాలో బాహుబలి ఎంతోకొంత సాధిస్తే ప్రపంచ వ్యాప్తంగా దంగల్‌ సాధించిన వసూళ్లని అధిగమించవచ్చునని బాహుబలి ఫాన్స్‌ ఎదురు చూస్తూ వుండగానే దంగల్‌ మరింతగా పెద్ద టార్గెట్‌ సెట్‌ చేస్తూ ఏ సినిమాకీ అందకుండా పోతోంది. ఏళ్ల తరబడి కష్టపడడం కానీ, భారీ గ్రాఫిక్‌ హంగులు, నిర్మాణ విలువలు లేకుండా కేవలం కథాబలంతో దంగల్‌ చేస్తోన్న సంచలనానికి మాత్రం అందరూ హ్యాట్సాఫ్‌ చెప్పి తీరాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు