పండుగ పూట ఆ ప్ర‌ముఖ హీరో జైల్లోనే!

పండుగ పూట ఆ ప్ర‌ముఖ హీరో జైల్లోనే!

చేసిన పాపం ఊరికే పోదంటారు. ఒక రోజు లేదంటే ఒక ఏడాది.. కాదంటే ప‌ది.. ప‌దిహేనేళ్లు ఆల‌స్యంగా అయినా చేసిన త‌ప్పుల‌కు మూల్యం వ‌డ్డీతో స‌హా చెల్లించ‌క త‌ప్ప‌ద‌న్న విష‌యం తాజాగా వెలుగు చూస్తున్న ఉదంతాల్ని చూస్తే ఇట్టే అర్థం కాక మాన‌దు. అత్యున్న‌త స్థానాల్లో ఉన్న‌ప్ప‌టికీ ఆరాచ‌కాలు చేసిన వారు ఏదో రోజు.. ఏదో విధంగా చ‌ట్టం ముందు దోషిగా నిల‌వ‌క త‌ప్ప‌ద‌న్న‌ది డేరా బాబా ఉదంతంలో స్ప‌ష్ట‌మైంది. ఇదేనా.. కొద్ది నెల‌ల క్రితం ప్ర‌ముఖ మ‌ల‌యాళ న‌టిని కారులో కిడ్నాప్ చేసి లైంగిక వేధింపుల‌కు గురి చేసిన ఎపిసోడ్ లోనూ మ‌ల‌యాళ ప్ర‌ముఖ న‌టుడు దిలీప్ అడ్డంగా బుక్ కావ‌ట‌మే కాదు.. అత‌గాడు చేసిన దారుణ వ్యూహం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ప‌క్కా ఆధారాల‌తో పోలీసులు అత‌న్ని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయ‌టం.. కోర్టు ఆయ‌న్ను రిమాండ్‌కు త‌ర‌లించాల‌న్న ఆదేశాలు జారీ చేసింది. పేరు.. ప‌లుకుబ‌డి.. సంప‌ద అన్నీ ఉన్నా.. ఏవీ ఆయ‌న్ను జైలు నుంచి బ‌య‌ట‌కు తీసుకురాలేక‌పోతున్నాయి. జైలుకు వెళ్లిన నాటి నుంచి బెయిల్ మీద బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు ఆయ‌న చేస్తున్న ప్ర‌య‌త్నాలు అన్ని ఇన్ని కావు. కానీ.. ఆయ‌నకు ఎదురుదెబ్బ‌లు త‌గులుతూనే ఉన్నాయి.  తాజాగా ఆయ‌న మ‌రోసారి బెయిల్ ప్ర‌య‌త్నాలు చేశారు. మ‌ల‌యాళీల ప్ర‌ముఖ పండ‌గైన ఓనం ప‌ర్వ‌దినాన ఆయ‌న‌కు చుక్కెదురైంది.

మంగ‌ళ‌వారం ఆయ‌న బెయిల్ అభ్య‌ర్థ‌న‌ను రెండోసారి హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే.. ప్రాథ‌మిక సాక్ష్యాలు బ‌లంగా ఉన్నాయ‌ని పేర్కొన్న కేర‌ళ‌ హైకోర్టు ఆయ‌న‌కు బెయిల్ ఇచ్చేందుకు నిరాక‌రించింది. ఈ ద‌శ‌లో దిలీప్‌కు కానీ బెయిల్ ఇస్తే కేసును ప్ర‌భావితం చేసే అవ‌కాశం ఉంద‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేసింది. మొత్త‌మ్మీదా బెయిల్ కోసం హీరో దిలీప్ చేస్తున్న ప్ర‌య‌త్నాల‌కు వ‌రుస ఎదురు దెబ్బ‌లు త‌గులుతున్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు