చిరంజీవికి నాగార్జున సాయం!

చిరంజీవికి నాగార్జున సాయం!

అమితాబ్‌బచ్చన్‌తో ఎలాగైనా 'రైతు' సినిమాలో కీలక పాత్ర చేయించాలని బాలకృష్ణ, కృష్ణవంశీ ముంబయి వెళ్లి మరీ బిగ్‌ బీని కలిసి వచ్చారు. వారిని సాదరంగానే స్వాగతించిన అమితాబ్‌ అందులో నటించడానికి మాత్రం తీరిక లేదని అనేసాడు. ఆ పాత్ర అమితాబ్‌ చేస్తేనే రైతు చేస్తానని చెప్పి బాలకృష్ణ పూర్తిగా దానిని పక్కన పడేసారు.

తెలుగు సినిమాలో నటించడానికి బిగ్‌ బి ఎలా ఒప్పుకుంటాడులెమ్మని అనుకున్నారు. కట్‌ చేస్తే, 'సైరా నరసింహారెడ్డి' చిత్రంలో అమితాబ్‌ కూడా ఒక పాత్ర చేస్తున్నారు. అసలు బిగ్‌ బిని చిరంజీవి అండ్‌ కో ఎప్పుడు కలుసుకున్నారో, ఎలా ఆయన సమ్మతం పొందారో కనీసం బాలీవుడ్‌ మీడియాకి కూడా తెలీలేదు.

ఇందులో అమితాబ్‌ పోషించే పాత్ర ఏమిటనే దానిపై క్లారిటీ లేకపోయినా కానీ ఆయన నటించడమైతే పక్కా అయింది. అసలు ఈ చిత్రంలో నటించడానికి బిగ్‌ బి ఎలా అంగీకరించారు? అమితాబ్‌తో సత్సంబంధాలు వున్న చిరంజీవి స్నేహితుడు నాగార్జున ఈ విషయంలో సాయపడినట్టు సమాచారం. అమితాబ్‌కి ఆఫర్‌ చేస్తోన్న క్యారెక్టర్‌ గురించి నాగార్జునకి క్లుప్తంగా వివరించి మాట సాయం కోరారట.

నాగ్‌ చెప్పడంతో కాదనలేక కథ వినడానికి రమ్మన్న అమితాబ్‌ తన క్యారెక్టర్‌ ఏమిటో పూర్తిగా తెలుసుకున్నాక ఓకే చెప్పారట. బిగ్‌ బిని కలవడానికి చరణ్‌, చిరంజీవి కూడా సురేందర్‌ రెడ్డితో పాటు వెళ్లారని, ఈ సినిమా స్కేల్‌ తెలుసుకుని ఆయన సంభ్రమానికి గురయి ఇందులో తప్పక నటిస్తానని మాటిచ్చారని సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు