రానా రచ్చ రంబోలా చేశాడు

రానా రచ్చ రంబోలా చేశాడు

దగ్గుబాటి రానా నటుడిగానే కాక.. మంచి వక్తగానూ మంచి పేరే సంపాదించాడు గత కొన్నేళ్లలో. అతను నడిపిస్తున్న టాక్ షో 'నెం.1 యారీ' మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అతడి సెన్సాఫ్ హ్యూమరే ఆ షోను రక్తి కట్టిస్తోంది. ఈ షోలో మాత్రమే కాదు.. ఏదైనా సినిమా వేడుకలకు వచ్చినా రానా తన వాక్చాతుర్యంతో కట్టి పడేస్తాడు. అతను భలే ఆసక్తికరంగా మాట్లాడతాడు.

'యుద్ధం శరణం' ఆడియో వేడుకలోనూ రానా ఇలాంటి స్పీచ్‌తోనే అందరినీ నవ్వుల్లో ముంచెత్తాడు. ఈ ఆడియో వేడుకను ఒక కాన్సెప్ట్‌తో నిర్వహించారు. వేదిక ఎక్కిన ప్రతి ఒక్కరూ మీరు మీ కుటుంబం కోసం ఎవరితో అయినా యుద్ధం చేశారా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది.

రానా వంతు రాగానే తనదైన శైలిలో బదులిచ్చాడు. తాను కుటుంబం కోసం యుద్ధం చేయలేదని... కుటుంబానికి వ్యతిరేకంగా యుద్ధం చేశానని చమత్కరించాడు. తాను సరిగా చదివేవాడిని కాదని.. పాస్ మార్కుల కోసం ఎప్పుడూ యుద్ధం జరిగేదని.. ఫెయిలయ్యాక మార్కుల విషయంలో ఇంట్లో కవర్ చేయడానికి యుద్ధం చేసేవాడినని.. తన కజిన్ అయిన నాగచైతన్య చాలా బాగా చదువుతూ తనను టార్చర్ పెట్టేవాడని.. అతడితో కూడా యుద్ధం చేయాల్సి వచ్చేదని రానా తెలిపాడు.

'యుద్ధం శరణం' ఆడియో వేడుకకు తనను రాత్రి 8 గంటలకు రమ్మని కార్తికేయ చెప్పాడని.. కానీ అంతకంటే ముందే ఫోన్ చేసి 'మీ నాన్న వచ్చేశాడు. వెంటనే వచ్చేయ్' అన్నాడని.. స్నానం కూడా చేయలేదని అంటే.. ఏం పర్వాలేదు ఏదో ఒక డ్రెస్ వేసుకుని వచ్చేయమన్నాడని.. మరోవైపు చైతూ ముందు రోజు ఫోన్ చేసి 'నీకు ఖాళీ ఉంటే వచ్చేయ్' అన్నాడని.. తనను వీళ్లు ఇంత బాగా 'ట్రీట్' చేస్తారని రానా చమత్కరించాడు. చివరగా మీ నాన్నను వెరైటీగా వేదిక మీదికి ఆహ్వానించండి అని యాంకర్ అడిగితే.. ''వెల్కం టు ద గ్రేటెస్ట్ ఫాదర్ ఆఫ్ ఫ్యాబులస్ సన్'' అంటూ రానా సురేష్ బాబును వేదిక మీదికి ఆహ్వానించడం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు