సెన్సార్ బోర్డు కొత్త ఛైర్మన్ షాక్

సెన్సార్ బోర్డు కొత్త ఛైర్మన్ షాక్

కేంద్ర సెన్సార్ బోర్డు ఛైర్మన్‌గా ప్రహ్లాద్ నిహలానిని తోలగించి ప్రసూన్ జోషిని నియమించినందుకు వారం కిందట దేశవ్యాప్తంగా సినీ వర్గాల్లో సంతోషం వెల్లివిరిసింది. సినిమాల విషయంలో మరీ కఠినంగా వ్యవహరిస్తూ.. తమ స్వేచ్ఛను ప్రహ్లాద్ హరిస్తున్నాడని.. అలాంటి ఆలోచనలున్న వ్యక్తి సెన్సార్ బోర్డు ఛైర్మన్‌గా ఉండకూడదని కొన్నేళ్లుగా ఫిలిం మేకర్స్ ప్రహ్లాద్‌ను వ్యతిరేకిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆయనపై వేటు పడటం.. ప్రసూన్ నియమితుడు కావడంతో పరిస్థితి మారుతుందని.. సినిమాలకు స్వేచ్ఛ వస్తుందని భావించారు. కానీ ప్రసూన్ సెన్సార్ బోర్డు ఛైర్మన్ అయ్యాక రివ్యూ చేసిన తొలి సినిమా మీదే నిషేధం విధించినట్లుగా వార్తలొస్తుండటం గమనార్హం.

ప్రసూన్ నేతృత్వంలోని కమిటీ 'తూఫాన్ సింగ్' అనే పంజాబ్ సినిమా చూసి.. దానిపై నిషేధం విధించినట్లు ఓ నేషనల్ డైలీ కథనం ప్రచురించింది. ప్రసూన్ రివ్యూ చేసిన తొలి సినిమా కూడా అదే అని పేర్కొంది. ఈ చిత్రం ఇండియన్ బ్యూరోక్రసీలో అవినీతి మీద పోరాడే ఓ వ్యక్తి కథతో తెరకెక్కింది. ఐతే ఈ చిత్రంలో హీరోకు తీవ్ర వాద భావజాలం కనిపిస్తుందని.. తీవ్రవాదులు ప్రభుత్వ అధికారుల మీద దాడులు చేయడాన్ని సమర్థిస్తున్నట్లుగా సినిమా తీశారని.. ఇందులో హింస హద్దులు దాటిపోయిందని.. అందుకే ఈ సినిమాను ప్రసూన్ కమిటీ నిషేధించాల్సి వచ్చిందని.. అంతమాత్రాన ప్రసూన్‌కు, ప్రహ్లాద్‌కు పోలిక పెట్టి ఈయన కూడా ఆ బాపతే అని విమర్శించడం సరికాదని సెన్సార్ బోర్డు వర్గాలు అంటున్నాయి.

ప్రసూన్‌ ముందుకు యాదృచ్ఛికంగా అలాంటి సినిమా వచ్చింది తప్ప.. ఇందులో ఆయన తప్పేమీ లేదంటున్నారు. విశేషం ఏంటంటే.. 'తూఫాన్ సింగ్' ఇప్పటికే విదేశాల్లో విడుదలైపోయింది. ఇండియాలో త్వరలో రిలీజ్ చేద్దామనుకుంటుండగా.. దానిపై నిషేధం పడ్డట్లు వార్తలొస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు