ఆధార్ పై సుప్రీం మ‌రో సంచ‌ల‌న తీర్పు!

ఆధార్ పై సుప్రీం మ‌రో సంచ‌ల‌న తీర్పు!

దేశ వ్యాప్తంగా తీవ్ర చ‌ర్చ‌కు తెర తీసిన ట్రిపుల్ త‌లాక్ మీద సంచ‌ల‌న తీర్పు ఇచ్చిన అత్యున్న‌త న్యాయ‌స్థానం తాజాగా మ‌రో సంచ‌ల‌న తీర్పును ఇచ్చింది. వ్య‌క్తిగ‌త గోప్య‌త (రైట్ టు ప్రైవ‌సీ) ప్రాథ‌మిక హ‌క్కేన‌ని తేల్చి చెప్పింది. ఆధార్ ద్వారా వ్య‌క్తిగ‌త గోప్య‌త హ‌క్కును ఉల్లంఘిస్తున్నారంటూ 2015లో సుప్రీంలో దాఖ‌లైన పిటీష‌న్ పై ఈ రోజు (గురువారం) సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ జేఎస్ ఖేహ‌ర్ నేతృత్వంలోని తొమ్మిది మంది న్యాయ‌మూర్తుల‌తో కూడిన ధ‌ర్మాస‌నం సంచ‌ల‌న తీర్పును ఇచ్చింది.

ఆర్టిక‌ల్ 21 ప్ర‌కారం వ్య‌క్తిగ‌త గోప్య‌త ప్రాథ‌మిక హ‌క్కేన‌ని రాజ్యాంగ విస్తృత ధ‌ర్మాస‌నం తేల్చి చెప్పింది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే సుప్రీం ధ‌ర్మాస‌నంలోని తొమ్మిది మంది జ‌డ్జిల బెంచ్ ఏక‌గ్రీవ తీర్పును ఇచ్చింది.  దేశంలో ఆధార్ ను త‌ప్ప‌నిస‌రి చేస్తూ.. దేశ పౌరుల స‌మాచారాన్ని ఆధార్ కోసం ప్ర‌భుత్వం సేక‌రించిన విష‌యం తెలిసిందే.

ఆధార్ కోసం వ్య‌క్తిగ‌తంగా క‌ళ్లు.. ముఖంతో పాటు వేలిముద్ర‌ల‌ను తీసుకుంటున్నారు. అయితే.. ఈ వ్య‌క్తిగ‌త డేటాను  ప్రైవేటు సంస్థ‌ల‌కు సైతం ప్ర‌భుత్వం ఇవ్వ‌టం స‌ర్వ‌త్రా ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

దీనిపై అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ.. ఆధార్ వివ‌రాలు బ‌హిర్గ‌తం చేయ‌కూడ‌ద‌ని.. ప్రైవేటు వ్య‌క్తుల‌కు.. సంస్థ‌ల‌కు ఇవ్వ‌కూడ‌దంటూ రెండేళ్ల క్రితం (2015)లో దాఖ‌లైన పిటీష‌న్ ను సుప్రీం విచారించింది. వ్య‌క్తిగ‌త వివ‌రాలు గోప్యంగా ఉంచుకోవ‌టం అనేది ప్రాథ‌మిక హ‌క్కుల కింద‌కే వ‌స్తుంద‌ని తేల్చి చెప్పింది. తాజాగా సుప్రీం వెల్ల‌డించిన తీర్పు ఇప్పుడు కొత్త చ‌ర్చ‌కు తెర తీయ‌టం ఖాయం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు