నంద్యాల‌పై ల‌గ‌డ‌పాటి స‌ర్వే రిజ‌ల్ట్ వ‌చ్చేసింది

నంద్యాల‌పై ల‌గ‌డ‌పాటి స‌ర్వే రిజ‌ల్ట్ వ‌చ్చేసింది

రాజ‌కీయ‌నేత‌గా మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ ఎంత సుప‌రిచితుడో.. ప్ర‌తిష్ఠాత్మ‌కంగా ఎక్క‌డ ఎన్నిక‌లు జ‌రిగినా.. త‌న టీంతో ఓటింగ్ స‌ర‌ళిపై స‌ర్వే చేయించ‌టం.. పోలింగ్ ముగిసిన వెంట‌నే ఆ ఫ‌లితాన్ని వెల్ల‌డించ‌టం గ‌డిచిన కొద్ది కాలంగా ఆయ‌న‌కు అల‌వాటుగా మారింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డితే రాజ‌కీయ స‌న్యాసం తీసుకుంటానని చెప్ప‌ట‌మే కాదు.. చేత‌ల్లో చేసి చూపించిన ల‌గ‌డ‌పాటి రాష్ట్ర విభ‌జ‌న నాటి నుంచి రాజ‌కీయాలకు దూరంగా ఉంటున్నారు. అదే స‌మ‌యంలో ప‌లువురు ముఖ్య‌నేత‌ల్ని అప్పుడ‌ప్ప‌డు క‌లుస్తూ వార్త‌ల్లోకి వ‌స్తున్నారు. రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటాన‌ని చెప్పిన ల‌గ‌డ‌పాటి రాజ‌కీయాంశాల విష‌యాలకు మాత్రం దూరం కాక‌పోవ‌టం గ‌మ‌నార్హం.

రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు మ‌హా ఉత్కంట‌తో ఎదురుచూసిన నంద్యాల ఉప ఎన్నిక‌కు సంబంధించి కీల‌క‌మైన పోలింగ్ ఘ‌ట్టం విజ‌య‌వంతంగా ముగిసింది. ఊహించిన‌ట్లే భారీ పోలింగ్ న‌మోదైంది. ఈ ఉప ఎన్నిక‌పై త‌న స‌ర్వే జోస్యాన్ని వెల్ల‌డించారు ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్. కొన్ని మీడియాల‌తో ప్ర‌త్యేకంగా మాట్లాడిన రాజ‌గోపాల్ త‌న స‌ర్వే ఫ‌లితాన్ని విడుద‌ల చేశారు.

ఓటింగ్ శాతం పెరిగిన నేప‌థ్యంలో తుది ఫ‌లితంపై త‌న అభిప్రాయాన్ని చెబుతూ.. ఈ ఎన్నిక‌ల్లో అధికార తెలుగుదేశం పార్టీ గెలుస్తుంద‌న్నారు. పోలింగ్ పెరిగిన‌ప్ప‌టికీ మెజార్టీ మాత్రం 10వేలకు ప‌రిమిత‌మ‌య్యే అవ‌కాశం ఉంద‌న్నారు. ఇప్ప‌టికున్న అంచ‌నా ప్ర‌కారం (పోలింగ్ పూర్తి అయిన కొద్ది గంట‌ల వ్య‌వ‌ధిలో మాట్లాడారు) ప‌ది శాతం మేర మెజార్టీ ఉండొచ్చ‌న్నారు. మొత్తం 1,73,335 మంది ఓట్లు వేసిన నేప‌థ్యంలో గ‌రిష్ఠంగా టీడీపీకి 20వేల ఓట్లు మెజార్టీ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని చెప్పారు.

ఉప ఎన్నిక‌ల్లో 10వేల ఓట్లు మొద‌లుకొని 20 వేల ఓట్ల మ‌ధ్య‌లో టీడీపీ అభ్య‌ర్థి భూమా బ్ర‌హ్మానంద రెడ్డికి మెజార్టీ ల‌భిస్తుంద‌న్న మాట‌ను ఆయ‌న చెప్పారు. పోలింగ్ స‌ర‌ళిని మ‌రింతగా విశ్లేషించ‌టం ద్వారా గురువారం మ‌రింత స్ప‌ష్ట‌త‌తో తుది ఫ‌లితాన్ని అంచ‌నా వేసే వీలుంద‌ని చెప్పారు. పోలింగ్ శాతం పెర‌గ‌టానికి కార‌ణం.. ఈ ఉప ఎన్నిక‌ను అధికార తెలుగుదేశం.. విప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకోవ‌ట‌మేన‌ని చెప్పారు. మ‌రి.. ల‌గ‌డ‌పాటి జోస్యం ఎంత‌వ‌ర‌కూ నిజం అవుతుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English