మహేష్ డైరెక్టర్.. రజినీ కోసం కథ రెడీ

మహేష్ డైరెక్టర్.. రజినీ కోసం కథ రెడీ

తమిళ సినీ పరిశ్రమలో ప్రస్తుతమున్న స్టార్ డైరెక్టర్లలో శంకర్, రాజమౌళిల తర్వాత అంతటి స్థాయి ఉన్న దర్శకుడంటే మురుగదాసే. అతడితో సినిమాలు చేయడానికి సౌత్ ఇండియాలోని ప్రతి స్టారూ ఆసక్తి చూపిస్తాడు. తమిళంలో అజిత్, విజయ్, సూర్య లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేశాడు మురుగదాస్.

తెలుగులో మెగాస్టార్ చిరంజీవినీ డైరెక్ట్ చేశాడు. ఇప్పుడు మహేష్ బాబుతో 'స్పైడర్' చేస్తున్నాడు. ఐతే దక్షిణాదిన ఎందరు స్టార్లతో పని చేసినప్పటికీ అంతిమంగా రజినీకాంత్‌తో చేయాలన్నది చాలామంది దర్శకుల కలగా ఉంటుంది. మురుగదాస్ కూడా అందుకు మినహాయింపేమీ కాదు. రజినీతో ఎప్పటికైనా సినిమా చేస్తానని అంటున్నాడు మురుగదాస్.

మరి రజినీతో సినిమా ఎప్పుడు అని అడిగితే.. తాను ఎప్పుడో సూపర్ స్టార్ కోసం కథ రెడీ చేసి పెట్టుకున్నట్లు మురుగదాస్ చెప్పాడు. రజినీ ఓకే అంటే ఎప్పుడైనా సినిమా చేయడానికి తాను సిద్ధమని అన్నాడు. మరి పా.రంజిత్ లాంటి రెండు సినిమాల వయసున్న దర్శకుడితో రెండో సినిమా చేస్తున్న రజినీ.. మురుగదాస్ లాంటి స్టార్ డైరెక్టర్ని ఎందుకు కరుణించడం లేదో మరి.

ఇక బాలీవుడ్ సూపర్ స్టార్లతో సినిమాల సంగతి ప్రస్తావిస్తే.. ఆల్రెడీ అమీర్ ఖాన్‌తో 'గజిని', అక్షయ్ కుమార్‌తో 'హాలిడే' చేశానని.. సల్మాన్‌ ఖాన్‌తో సినిమా చేసే అవకాశం లేకపోలేదని చెప్పాడు మురుగదాస్. సల్మాన్‌కు తాను ఇప్పటిదాకా కథ చెప్పలేదు కానీ.. తామిద్దరం కలిసినపుడల్లా.. 'మనం వెంటనే సినిమా చేసేద్దాం.. పది రోజుల్లో షూటింగ్ మొదలుపెట్టేద్దాం' అని సల్మాన్ అంటుంటాడని మురుగదాస్ తెలిపాడు. 'స్పైడర్' తర్వాత ఎవరితో సినిమా చేయాలన్నది మాత్రం తాను ఇంకా నిర్ణయించుకోలేదని మురుగదాస్ చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు