‘సై రా’ కాస్టింగ్ లో అతను స్పెషల్

 ‘సై రా’ కాస్టింగ్ లో అతను స్పెషల్

నిన్న మధ్యాహ్నం నుంచి తెలుగు సినిమా ప్రియుల చర్చలన్నీ మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘సై రా’ చుట్టూనే నడుస్తున్నాయి. ఈ టైటిల్ గురించి.. ఈ సినిమా మోషన్ పోస్టర్ గురించి.. ఈ సినిమాలో కనిపించబోయే నటీనటులు.. దీనికి పని చేయబోయే సాంకేతిక నిపుణుల గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఐతే ఈ నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరిలోనూ అత్యంత విలక్షణంగా అనిపించే.. ఆశ్చర్యం కలిగించే పేరు ఒకటుంది. అదే.. విజయ్ సేతుపతి.

చిరు సినిమాలో అమితాబ్ బచ్చన్ చేయడం పెద్ద వార్తే కానీ.. ఆయన ఈ సినిమాలో నటిస్తాడన్న ప్రచారం చాన్నాళ్ల నుంచే ఉంది. పైగా అమితాబ్ ఏదో మొహమాటానికి చిన్న క్యామియో రోల్ లాంటిది చేసే అవకాశముంది తప్ప పూర్తి స్థాయి పాత్ర చేసే అవకాశాలు తక్కువే. ఇక ‘ఈగ’తో తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన కిచ్చా సుదీప్‌తో పాటు జగపతిబాబు.. నయనతార కొత్తేమీ కాదు. వీళ్లు చిరుతో కలిసి నటించడం ఆసక్తికరమే.

ఐతే వీళ్లందరితో పోలిస్తే విజయ్ సేతుపతి ఈ సినిమాలో నటించడం మరింత ఆసక్తి రేకెత్తించేదే. క్యారెక్టర్ రోల్స్, విలన్ పాత్రలతో చిన్న చిన్న అడుగులు వేస్తూ.. ‘పిజ్జా’ సినిమాతో హీరోగా మారి.. ఆ తర్వాత ఇంతింతై అన్నట్లుగా విజయ్ సేతుపతి తమిళ సినిమాల్లో ఎదిగిన తీరు అసాధారణం. సూదుకవ్వుం, నానుమ్ రౌడీదా, సేతుపతి, కాదలుం కడందు పోగుం, ధర్మదురై లాంటి సినిమాలతో నటుడిగా గొప్ప స్థాయికి చేరుకున్నాడు విజయ్.

కమల్ హాసన్, సూర్యల తర్వాత అంతటి విలక్షణ కథానాయకుడిగా విజయ్ పేరు సంపాదించాడు. ఏ పాత్ర చేసినా.. అందులో అతను ఒదిగిపోయే తీరు అద్భుతం. ఈ మధ్యే ‘విక్రమ్ వేద’తో మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. అలాంటి నటుడు చిరు సినిమాలో కీలక పాత్ర పోషించబోతుండటం ఆసక్తి రేకెత్తించేదే. తెలుగు ప్రేక్షకులకు అంతగా పరిచయం లేని విజయ్ సేతుపతి.. ‘సై రా’లో తన నటనతో ఆశ్చర్యపరిచే అవకాశాలున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English