చిరు కోసం తమన్‌ను అలా వాడుకున్నారు

చిరు కోసం తమన్‌ను అలా వాడుకున్నారు

ఈ రోజు విడుదలైన ‘సైరా.. నరసింహారెడ్డి’ మోషన్ పోస్టర్‌కు.. ఈ సినిమా కాస్ట్ అండ్ క్రూ గురించి వివరించే వీడియోకు.. బ్యాగ్రౌండ్ స్కోర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందనడంలో సందేహం లేదు. సినిమా గ్రాండియర్‌కు తగ్గట్లుగా.. ఒక ఉద్రేకం తీసుకొచ్చేలా ఇంటెన్స్ బ్యాగ్రౌండ్ స్కోర్ సమకూరింది ఈ రెండు వీడియోలకు. ఐతే ఈ మ్యూజిక్ వింటే అందులో ‘సైరా’ సంగీత దర్శకుడైన ఎ.ఆర్.రెహమాన్ ముద్ర ఏమీ కనిపించదు.

పైగా ‘సైరా..’కు రెహమాన్ సంగీత దర్శకుడిగా ఫిక్సయింది కొన్ని రోజుల కిందటే. చిన్న మ్యూజిక్ బిట్ ఇవ్వాలన్నా చాలా టైం తీసుకునే రెహమాన్.. ఈ రెండు వీడియోలకు ఇంత తక్కువ వ్యవధిలో మ్యూజిక్ ఎలా ఇచ్చాడో అన్న సందేహాలు కూడా కలిగాయి జనాలకు.

ఐతే వాస్తవం ఏంటంటే.. ఈ వీడియోలకు బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చింది రెహమాన్ కాదు.. తమన్. అవును.. వీటి కోసం తన మిత్రుడి సాయం తీసుకున్నాడు సురేందర్ రెడ్డి. వీళ్లిద్దరూ కలిసి కిక్.. రేసు గుర్రం.. కిక్-2.. లాంటి సినిమాలకు పని చేశారు. ‘సైరా..’కు కూడా తమనే సంగీత దర్శకుడని ఇంతకుముందు వార్తలొచ్చాయి. కానీ పాన్ ఇండియన్ మూవీగా తీయాలనుకుంటున్న ఈ సినిమాకు రెహమాన్ అయితే నేషనల్ అప్పీల్ వస్తుందని.. ఉత్తరాది ప్రేక్షకుల దృష్టిని కూడా ఆకర్షించొచ్చని రెహమాన్‌ను తీసుకున్నట్లుంది చిత్ర బృందం.

ఐతే మోషన్ పోస్టర్ వరకు తనను పరిమితం చేయడాన్ని మరోలా భావించకుండా సిన్సియర్ ఎఫర్ట్‌ పెట్టి అందరి మన్ననలూ అందుకుంటున్నాడు తమన్. ఈ బ్యాగ్రౌండ్ స్కోర్ విన్నాక సినిమాకు కూడా తమన్ సంగీతం అందిస్తే బాగుండేదన్న ఫీలింగ్ కలిగితే ఆశ్చర్యమేమీ లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు