పిచ్చెక్కిస్తున్న ఆ హీరో క్రేజ్

పిచ్చెక్కిస్తున్న ఆ హీరో క్రేజ్

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ తన సినిమాలకు సంబంధించి ఏదైనా ఈవెంట్లో పాల్గొనడం ఎప్పుడైనా చూశారా? తన సినిమాను అతను ఏ రకంగా అయినా ప్రమోట్ చేయడం గమనించారా? ఇంతకుముందు మడికట్టుకు కూర్చున్న సౌత్ ఇండియన్ స్టార్ హీరోలందరూ కూడా కట్టుబాట్లు పక్కన పెట్టేసి తమ సినిమాల్ని అగ్రెసివ్‌గా ప్రమోట్ చేస్తుంటే.. అజిత్ మాత్రం ఇప్పటికీ తెరచాటునే ఉంటున్నాడు ఇప్పటికీ. అతడి కొత్త సినిమా ‘వివేగం’ విషయంలోనూ అంతే. ఇప్పటిదాకా ఈ సినిమా గురించి అజిత్ ఒక్క మాట మాట్లాడింది లేదు. ఈ సినిమాకు ఆడియో వేడుక చేయలేదు. ఏ ప్రి రిలీజ్ ఈవెంట్ చేయలేదు. వేరే పబ్లిసిటీ కూడా పెద్దగా లేదు. కానీ ఈ చిత్రానికి వచ్చిన క్రేజ్ చూస్తే మతి పోవాల్సిందే.

కేవలం టీజర్, ట్రైలర్‌తోనే ఈ సినిమా జనాల్లో విపరీతమైన క్యూరియాసిటీ తెచ్చింది. సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఎలాంటి క్రేజ్ ఉంటుందో.. ‘వివేగం’ కూడా అలాంటి క్రేజే తెచ్చుకుంది. ఈ గురువారం విడుదల కాబోతున్న ‘వివేగం’కు అడ్వాన్స్ బుకింగ్స్ చూసి అందరూ షాకైపోతున్నారు. ఒక్క చెన్నై సిటీలో మాత్రమే తొలి రోజు వివేగం షోలు దాదాపు 300 పడుతుండటం విశేషం. రజినీకాంత్ ‘కబాలి’.. ‘బాహుబలి’ల కంటే ఎక్కువగా ‘వివేగం’ షోలు పడుతున్నాయి చెన్నైలో. ఒక్క ‘మాయాజాల్’ అనే మల్టీప్లెక్సులో తొలి రోజు ఏకంగా 65 షోలు వేస్తున్నారు ‘వివేగం’ సినిమాకు.

తమిళనాడు వ్యాప్తంగా భారీ స్థాయిలో ఈ సినిమా విడుదలవుతోంది. మరోవైపు కేరళలో ఏ పరభాషా కథానాయకుడి సినిమాకూ లేని విధంగా 30 థియేటర్లలో ‘వివేగం’ను రిలీజ్ చేస్తున్నారు. అక్కడ తొలి రోజే 1000కి పైగా షోలు పడుతుండటమూ రికార్డేనట. కర్ణాటకలోనూ ఈ చిత్రం భారీ స్థాయిలో విడుదలవుతోంది. ‘వివేగం’ తెలుగు వెర్షన్ నేరుగా తెలుగు రాష్ట్రాల్లో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. మొత్తంగా ఈ గురువారం సౌత్ ఇండియా అంతటా ‘వివేగం’ క్రేజ్ చూడబోతున్నామన్నమాట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు