‘ఎఫ్’ వర్డ్స్‌తో రెచ్చిపోయిన యంగ్ హీరో

‘ఎఫ్’ వర్డ్స్‌తో రెచ్చిపోయిన యంగ్ హీరో

విజయ్ దేవరకొండ సినిమాలోనే కాదు బయట కూడా ‘అర్జున్ రెడ్డి’ లాగే ప్రవర్తిస్తున్నాడు. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో అతను చూపించిన యాటిట్యూడ్‌ చూసి జనాలకు దిమ్మదిరిగిపోయింది. ఇక తాజాగా ‘అర్జున్ రెడ్డి’ పోస్టర్లను చించేస్తున్న సీనియర్ కాంగ్రెస్ నేత వి.హనుమంతరావును ఉద్దేశించి ‘‘తాతయ్యా.. చిల్’’ అతను ట్విట్టర్లో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతుండగానే.. ‘అర్జున్ రెడ్డి’ ప్రి రిలీజ్ ఈవెంట్లో మరింతగా రెచ్చిపోయాడు విజయ్. స్టేజ్ మీద ‘ఎఫ్’ వర్డ్ విచ్చలవిడిగా వాడుతూ.. ‘అర్జున్ రెడ్డి’ ట్రైలర్లో వాడిన పెద్ద బూతు పదాన్ని ఈ వేడుకకు వచ్చిన వాళ్లందరితో పదే పదే పలికిస్తూ.. అతను రెచ్చిపోయిన తీరు టాలీవుడ్లో పెద్ద చర్చనీయాంశంగా మారిపోయింది.

‘అర్జున్ రెడ్డి’ ట్రైలర్ లాంచ్ సందర్భంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అంటూ తన దగ్గరున్న డబ్బు మొత్తం బెట్ కట్టడానికి రెడీ అంటూ చేసిన వ్యాఖ్యల మీద సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమయ్యాయని.. తనను చాలా మంది తిట్టి పోశారని.. తన ఆ వ్యాఖ్యలతో కొందరు హర్ట్ అయ్యారంటూ ఆ సంగతి ప్రస్తావించేసరికి.. వాళ్లకు విజయ్ క్షమాపణ చెబుతాడేమో అనుకుంటే.. ఆ ప్రసక్తే లేదు అంటూ గట్టిగా ‘ఎఫ్’ వర్డ్ ఉచ్ఛరించాడు విజయ్. అంతే కాక.. మీకెవరైనా అణకువతో ఉండమని అంటే అస్సలు పట్టించుకోవద్దంటూ ఈ వేడుకకు వచ్చిన యూత్ అందరికీ పిలుపు ఇచ్చాడు విజయ్.

‘అర్జున్ రెడ్డి’పై తనది ఓవర్ కాన్ఫిడెన్స్ అని అందరూ అంటున్నారని.. తన సినిమా మీద హీరోకే కాన్ఫిడెన్స్ లేకపోతే.. ఇంకెవరికి ఉంటుంది అని అతను ప్రశ్నించాడు. ఆ తర్వాత సెన్సార్ వాళ్లను టార్గెట్ చేసుకుంటూ.. వాళ్లు ‘ఎ’ సర్టిఫికెట్ ఇవ్వడం సంతోషమే అని.. కానీ సినిమాలో ఒక సన్నివేశంలో అవసరం కాబట్టి బూతు వాడామని.. దాన్ని మ్యూట్ చేయమన్నారని.. ఐతే సినిమాలో తాను ఆ మాట వచ్చినపుడు మ్యూట్ వస్తే.. తన బదులు ప్రేక్షకులు ఆ పదం వాడాలని అతను పిలుపునివ్వడం విశేషం. ఆ మాటను ఈవెంట్‌కు హాజరైన వాళ్లందరితో విజయ్ పదే పదే ఆ మాటను పలికించడం గమనార్హం.

మొత్తంగా ‘అర్జున్ రెడ్డి’ టీజర్, ట్రైలర్లలో ఎలాంటి యాటిట్యూడ్ చూశామో.. విజయ్ బయట కూడా అదే యాటిట్యూడ్ చూపిస్తుండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అచ్చంగా ఈ తరం యారొగెంట్ యూత్‌కు ప్రతినిధిలా కనిపిస్తున్నాడు విజయ్. ‘అర్జున్ రెడ్డి’కి హైప్ వచ్చింది కాబట్టి విజయ్ ఇంత కాన్ఫిడెన్స్, యాటిట్యూడ్, పొగరు చూపించడం ఓకే కానీ.. ఈ సినిమా రిజల్ట్ తేడా కొడితే.. లేదా అతను తర్వాత నటించే సినిమాల ఫలితాలు అటు ఇటు అయితే.. అప్పుడు కూడా ఇలాగే మాట్లాడతాడా అన్నది ప్రశ్న.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు