ఫ్లాప్ హీరో-ఫ్లాప్ డైరెక్టర్ కలిసి...

ఫ్లాప్ హీరో-ఫ్లాప్ డైరెక్టర్ కలిసి...

‘అఆ’తో కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు నితిన్. ఈ సినిమాతో నితిన్ కెరీర్ మరో స్థాయికి వెళ్తుందని అనుకున్నారంతా. ‘లై’ సినిమా టీజర్.. ట్రైలర్ చూస్తే ఆ అంచనాలు నిజమయ్యేలాగే కనిపించాయి. కానీ ఈ సినిమా ఊహించని ఫలితాన్నందుకుంది. పాజిటివ్ టాక్ తెచ్చుకుని కూడా ఫ్లాప్ అయింది. ఓ వర్గం ప్రేక్షకులకు మాత్రమే నచ్చేలా సినిమా తీయడం.. తీవ్ర పోటీ మధ్య రిలీజ్ చేయడం ‘లై’కి చేటు చేసింది. దీంతో నితిన్ మళ్లీ డౌన్ అయ్యాడు.

నితిన్‌కు ఫ్లాపులు కొత్తేమీ కాదు కానీ.. కెరీర్ మరో స్థాయికి వెళ్లే సమయంలో ఈ ఫ్లాప్ రావడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఈ సినిమా పూర్తవకముందే నితిన్.. లిరిసిస్ట్ టర్న్డ్ డైరెక్టర్ కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ సినిమా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే సెట్స్ మీదికి వెళ్లిపోయింది. ఈలోపే నితిన్ మరో సినిమాను ఓకే చేసినట్లు సమాచారం.

వరుసగా క్లాస్ టచ్ ఉన్న సినిమాలే చేస్తున్న నితిన్.. ఈసారి రూటు మార్చి మాస్ మసాలా సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ఆ తరహా సినిమాలకు పెట్టింది పేరైన సంపత్ నందితో అతను పని చేయబోతున్నాడట. ‘ఏమైంది ఈవేళ’.. ‘రచ్చ’.. ‘బెంగాల్ టైగర్’ లాంటి సినిమాలో మినిమం గ్యారెంటీ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న సంపత్.. ఇటీవలే ‘గౌతమ్ నంద’తో దెబ్బ తిన్నాడు.

సంపత్ కెరీర్‌కు పాజిటివ్ టర్న్ ఇస్తుందనుకున్న ఈ సినిమా.. అతణ్ని తీవ్ర నిరాశకు గురి చేసింది. ఐతే ‘బెంగాల్ టైగర్’ నిర్మాత రాధా మోహన్.. సంపత్‌కు మరో అవకాశమిస్తున్నట్లు సమాచారం. ఆ చిత్రంలో నితిన్ కథానాయకుడిగా నటిస్తాడట. ప్రస్తుతం కథా చర్చలు నడుస్తున్నాయి. త్వరలోనే ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు