అభిమానులకు స్టార్ హీరో వార్నింగ్

అభిమానులకు స్టార్ హీరో వార్నింగ్

తమిళ స్టార్ హీరోలు విజయ్, అజిత్ ఇద్దరూ కూడా సూపర్ ఫాలోయింగ్ ఉన్నవాళ్లే. ఫ్యాన్ ఫాలోయింగ్ విషయంలో ఇద్దరిలో ఎవరు ఎవరికీ తీసిపోరు. ఐతే ఈ ఇద్దరు హీరోల్లో కామన్‌గా కనిపించే ఓ మంచి విషయం ఏంటంటే.. ఇద్దరూ లో ప్రొఫైల్లో ఉంటారు. అతి మాటలు మాట్లాడరు. అతి చేష్టలూ చేయరు.

కానీ వాళ్ల అభిమానులు మాత్రం ఈ హీరోల్లా సింపుల్‌గా ఉండరు. ఎప్పుడూ పరస్పరం దుమ్మెత్తి పోసుకుంటూ.. సోషల్ మీడియాలో దిగజారి ప్రవర్తిస్తుంటారు. అవతలి హీరోను, అభిమానుల్ని తక్కువ చేయడం.. వాళ్లను ట్రోల్ చేయడం.. దారుణమైన కామెంట్లు చేయడం ఇద్దరు హీరోల అభిమానులకూ అలవాటే.

తమ హీరోల్ని ఎవరైనా ఏమన్నా అన్నారంటే చాలు.. వేలు, లక్షల మంది సోషల్ మీడియాలో దాడి మొదలుపెట్టేస్తారు. గతంలో అజిత్ గురించి ఏదో కామెంట్ చేసిందన్న కారణంతో అజిత్ ఫ్యాన్స్ ఆమెను టార్గెట్ చేసుకుని దారుణమైన కామెంట్లు చేశారు. ఈ మధ్య ఓ లేడీ జర్నలిస్ట్ విజయ్ సినిమా గురించి కామెంట్ చేసిందని ఆమె మీద అతడి ఫ్యాన్స్ పడిపోయారు. దీంతో ఈ అభిమానుల వల్ల ఆ హీరోలకు కూడా చెడ్డ పేరు వచ్చే పరిస్థితి వచ్చింది.

విజయ్, అజిత్ అభిమానుల ఆగడాలు శ్రుతి మించిపోతున్నాయని.. ఆ హీరోలైనా వీళ్లను కంట్రోల్ చేయాలన్న అభిప్రాయం ఊపందుకుంది. ఈ నేపథ్యంలోనే మొన్న విజయ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎవరైనా తమ అభిప్రాయాలు చెప్పొచ్చని.. ఆ అభిప్రాయాలు నచ్చనంత మాత్రాన వాళ్లను లక్ష్యంగా చేసుకోవడం సరికాదంటూ విజయ్ హితవు పలుకుతూ తమ అభిమానుల తరఫున సారీ చెప్పడమే కాక.. అభిమానులు కూడా మారాలంటూ పిలుపునిచ్చాడు.

తాజాగా అజిత్ కూడా ఇదే తరహా స్టేట్మెంట్ ఇచ్చాడు. తనకు సోషల్ మీడియాలో ఎక్కడా అధికారిక అకౌంట్ లేదని.. తన తరఫున వచ్చే కామెంట్లను పట్టించుకోవద్దని అన్నాడు. పనిలో పనిగా సోషల్ మీడియాలో హద్దులు దాటి ప్రవర్తించే అభిమానుల్ని హెచ్చరించాడు. వేరే వాళ్లను టార్గెట్ చేసుకుని ట్రోలింగ్ చేసే పద్ధతి విడిచి పెట్టాలని హితవు పలికాడు. మొత్తానికి కోలీవుడ్ సూపర్ స్టార్లిద్దరూ ఇప్పటికైనా స్పందించి.. అభిమానుల్ని హెచ్చరించడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు