‘లై’కి కోత పెట్టి.. వాటికిస్తున్నారు

‘లై’కి కోత పెట్టి.. వాటికిస్తున్నారు

గత వారాంతంలో ఒకే రోజు మూడు సినిమాలు విడుదల కావడంతో థియేటర్ల విషయంలో చాలా ఇబ్బందైంది. సురేష్ బాబు చేతిలో ఎక్కువ థియేటర్లుండటంతో ఆయన తన నిర్మాణంలో వచ్చిన ‘నేనే రాజు నేనే మంత్రి’కి కావాల్సినన్ని థియేటర్లు ఇప్పించుకున్నారు. ఇక ‘14 రీల్స్’ వాళ్లకు కూడా పలుకుబడి.. ఎగ్జిబిటర్లతో మంచి సంబంధాలు ఉండటంతో ‘లై’ సినిమాకు కూడా ఓ మోస్తరుగానే థియేటర్లు దక్కాయి. ఎటొచ్చీ బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా ‘జయ జానకి నాయక’కే ఆశించినన్ని థియేటర్లు దక్కలేదు. మిగతా రెండు సినిమాలకు ఉన్న స్టార్ వాల్యూ ఈ చిత్రానికి లేకపోవడం వల్ల ట్రేడ్‌లో అంత ఆసక్తి కూడా కనిపించలేదు. ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా నామమాత్రంగా సాగాయి.

ఐతే రిలీజ్ తర్వాత సీన్ మారిపోయింది. మూడు సినిమాల్లోకి ఎక్కువ పాజిటిక్ టాక్ ‘జయ జానకి నాయక’నే తెచ్చుకుంది. ఓపెనింగ్స్ ‘నేనే రాజు నేనే మంత్రి’కే ఎక్కువ వచ్చినప్పటికీ ఓవరాల్‌గా ప్రేక్షకులు టాప్ మార్క్స్ ‘జయ జానకి నాయక’కే వేశారు. ఐతే ఈ రెండు సినిమాలూ బాక్సాఫీస్ దగ్గర జోరు చూపిస్తుంటే.. మరీ క్లాస్‌గా తయారైన ‘లై’ సినిమా ప్రేక్షకుల మెప్పు పొందలేకపోయింది. వీకెండ్లోనే ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించని ఈ సినిమా.. ఆ తర్వాత మరీ డల్లయిపోయింది.

రెండో వారాంతంలోకి వచ్చేసరికి ఎగ్జిబిటర్లు మొహమాటం లేకుండా ‘లై’ సినిమాకు థియేటర్ల కోత పెట్టేశారు. వంద థియేటర్ల దాకా ‘జయ జానకి నాయక’కు ఇచ్చేశారు. మరోవైపు ఈ శుక్రవారం తక్కువ థియేటర్లలో రిలీజైన ‘ఆనందో బ్రహ్మ’కు సైతం ఆదివారం థియేటర్లు పెంచుతుండటం విశేషం. పాజిటివ్ టాక్‌తో మొదలైన ఈ చిత్రం తొలి రోజు సాయంత్రం నుంచి వసూళ్లు బాగా పెంచుకుంది. స్టార్ వాల్యూ లేకపోయినా దీనికి హౌస్ ఫుల్స్ పడుతున్నాయి. దీనికి కూడా ‘లై’ ఆడుతున్న థియేటర్లలోనే కోత పెట్టి అదనంగా ఇస్తుండటం విశేషం. మొత్తానికి త్రిముఖ పోటీ వల్ల ‘లై’కి మామూలు పంచ్ పడలేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు