ఈట‌ల బీజేపీలో ఎప్పుడు చేరుతున్నారంటే…

గ‌త కొద్దికాలంగా వార్త‌ల్లో వ్య‌క్తిగా నిలుస్తున్న మాజీ మంత్రి , టీఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నేత ఈట‌ల రాజేంద‌ర్ విష‌యంలో మరో కీల‌క అప్‌డేట్ తెర‌మీద‌కు వ‌చ్చింది. ఆయ‌న బీజేపీలో చేర‌నున్నార‌నే వార్త‌ల‌కు బ‌లం చేకూర్చేలా ఎప్పుడు ప‌ద‌వికి రాజీనామా చేయ‌నున్నారు? ఎప్పుడు కాషాయ కండువా క‌ప్పుకోనున్నార‌నే విష‌యంలో స్ప‌ష్ట‌త వ‌చ్చేసిందని అంటున్నారు. జూన్ 2న త‌న ప‌ద‌వికి రాజీనామా చేయ‌నున్న ఈట‌ల రాజేంద‌ర్ జూన్ 6న బీజేపీలో చేర‌నున్న‌ట్లు స‌మాచారం.

అసైన్డ్ భూముల ఆరోపణల నేపథ్యంలో ఈటల రాజేందర్ మంత్రి ప‌ద‌వి పోవ‌డం, ఆయ‌న్ను తెలంగాణ ప్ర‌భుత్వం టార్గెట్ చేయ‌డం తెలిసిన సంగ‌తే. మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేంద‌ర్ తదుపరి ఎలాంటి అడుగు వేస్తారన్న దానిపై రాజకీయ వర్గాల్లోనే కాకుండా సామాన్య ప్రజల్లోను ఆస‌క్తి నెలకొంది. త‌న స‌న్నిహితులతో పాటుగా నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన‌ అందరి అభిప్రాయాలను తీసుకున్న ఈట‌ల సొంత పార్టీ ఆలోచ‌న విర‌మించుకొని BJPలో చేరడానికే మొగ్గు చూపుతున్నారని స‌మాచారం. బీజేపీలో చేరికపై ఆయ‌న నుంచి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌న‌ప్ప‌టికీ ఈ మేర‌కు నిర్ణ‌యం జరిగింద‌ని అంటున్నారు.

త‌న పొలిటిక‌ల్ కెరీర్‌పై ఇక సందిగ్ద‌త ఉంచడం స‌రికాద‌ని భావించిన ఈట‌ల రాజేంద‌ర్ బీజేపీ వైపు అడుగులు వేయ‌డం స‌రైంద‌ని భావించిన‌ట్లు తెలుస్తోంది. ఈ మేర‌కు జూర్ 2న ఆయ‌న త‌న ప‌ద‌వికి గుడ్ బై చెప్తార‌ని అంటున్నారు. అంతా అనుకున్న‌ట్లు జ‌రిగితే జూన్ 6న బీజేపీ ముఖ్య నేత‌ల స‌మ‌క్షంలో ఢిల్లీలో కాషాయ కండువా క‌ప్పుకోనున్న‌ట్లు పేర్కొంటున్నారు. ఈ విష‌యంలో ఒక‌ట్రెండు రోజుల్లో క్లారిటీ వ‌స్తుంద‌ని స‌మాచారం.