అల్లరోడు ఇంత రిస్కు చేస్తున్నాడేంటి?

అల్లరోడు ఇంత రిస్కు చేస్తున్నాడేంటి?

ఎప్పుడో ఐదేళ్ల కిందట ‘సుడిగాడు’తో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు అల్లరి నరేష్. కానీ దురదృష్టవశాత్తూ అల్లరోడికి అదే చివరి హిట్లు కూడా అయింది. ఐదేళ్లుగా నరేష్ రెండంకెల సంఖ్యలో సినిమాలు చేశాడు. కానీ అందులో ఏదీ ఆడలేదు. అందులోనూ గత రెండు మూడేళ్లలో చేసిన సినిమాలైతే పూర్తిగా నిరాశ పరిచాయి.

ఒకప్పుడు అల్లరి నరేష్ సినిమాలు ఫ్లాపైనా సేఫ్ జోన్లోనే ఉండేవి. కానీ తర్వాత తర్వాత అతడి మార్కెట్ బాగా దెబ్బ తినేసి ఓపెనింగ్స్ కూడా కొరవడటంతో దారుణమైన ఫలితాన్ని చూశాయి. ఇలాంటి పరిస్థితుల్లో బాగా గ్యాప్ తీసుకుని అల్లరోడు చేసిన సినిమా ‘మేడ మీద అబ్బాయి’.

మలయాళంలో సూపర్ హిట్టయిన ‘ఒరు వడక్కన్ సెల్ఫీ’ సినిమా రీమేక్‌లో నటించాడు నరేష్. ఒరిజినల్‌కు దర్శకత్వం వహించిన ప్రజీతే తెలుగులోనూ ఈ చిత్రాన్ని రూపొందించాడు. గత కొన్నేళ్లలో అల్లరోడి సినిమాలు ఫ్లాపవడానికి ప్రధాన కారణం అవన్నీ ఒక మూసలో ఉండటం. ఐతే ఇప్పుడు చేసిన సినిమా డిఫరెంట్‌గా ఉంటుందంటున్నాడు అల్లరోడు. ఈ సినిమా కొన్నాళ్ల కిందటే పూర్తయింది. మంచి రిలీజ్ డేట్ కోసం చూస్తున్నారు. ఐతే చూసి చూసి సెప్టెంబరు 8న విడుదల కోసం ముహూర్తం ఫిక్స్ చేశారు.

కానీ ఆ డేటుకు ఆల్రెడీ నాగచైతన్య సినిమా ‘యుద్ధం శరణం’ షెడ్యూల్ అయి ఉంది. మంచు మనోజ్ సినిమా ‘ఒక్కడు మిగిలాడు’ కూడా ఆ రోజే రావాల్సి ఉంది. ఆ రెండూ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నాక కూడా అల్లరోడి సినిమాను అదే రోజుకు షెడ్యూల్ చేశారు. అల్లరోడి కెరీర్‌కు చాలా కీలకమైన సినిమాను దీని కంటే ఎక్కువ ఆకర్షణ ఉన్న రెండు సినిమాల మధ్య విడుదల చేయాలని చూడటం సాహసమే. మరి ఏ ధైర్యంతో ఇంత రిస్క్ చేస్తున్నారో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు