కొర‌డాతో మోడ‌ల్ ను కొట్టిన దేశాధ్య‌క్షుడి వైఫ్‌

కొర‌డాతో మోడ‌ల్ ను కొట్టిన దేశాధ్య‌క్షుడి వైఫ్‌

దేశాధ్య‌క్షుడి స‌తీమ‌ణి అంటే ఎంత ప్రాధాన్య‌త ఉంటుందో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. స‌ద‌రు దేశంలోనే కాదు.. విదేశాల్లోనూ దేశాధ్య‌క్షుడి స‌తీమ‌ణికి చాలానే ప్రాధాన్య‌త ఇస్తుంటారు. ఇక‌.. అలాంటి ఉన్న‌త స్థానంలో ఉన్న వ్య‌క్తి జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రిస్తారు. తాము వేసే ప్ర‌తి అడుగు.. త‌మ దేశ ప‌ర‌ప‌తిని పెంచేలా ఉండేందుకు ప్ర‌య‌త్నిస్తుంటారు. అలాంటి అత్యున్న‌త స్థాయిలో ఉన్న వ్య‌క్తి  నేర‌స్తుడిలా వ్య‌వ‌హ‌రించ‌టాన్ని క‌ల‌లో కూడా ఊహించ‌లేం.

అంతేనా..  త‌ప్పు చేసి.. దాన్ని క‌ప్పిపుచ్చుకోవ‌టానికి  పారిపోతార‌ని అనుకోలేం. కానీ.. ఇలాంటి ప‌నే చేసిందో దేశాధ్య‌క్షుడి స‌తీమ‌ణి. అది కూడా దేశం కాని దేశంలో. ఇంత‌కీ ఆమె ఎవ‌రు? ఆమె చేసిన దారుణం ఏమిటి?  చేసిన వెధ‌వ ప‌నిని త‌ప్పించుకోవ‌టానికి ఆమేం చేశార‌న్న‌ది చూస్తే..

జింబాబ్వే అధ్య‌క్షుడు రాబ‌ర్ట్ ముగాబేను ప‌లువురు న‌ర‌రూప రాక్ష‌సుడిగా అభివ‌ర్ణిస్తారు. నియంత‌గా వ్య‌వ‌హ‌రించ‌టంతో.. అవినీతి అక్ర‌మాల‌తో పాటు.. ప్ర‌జ‌ల్ని హింసించే విష‌యంలో అత‌డి తీరే వేరుగా చెబుతుంటారు. అత‌డి ల‌క్ష‌ణాల‌కు ఏ మాత్రం త‌గ్గ‌ని తీరును ప్ర‌ద‌ర్శించిన అత‌డి స‌తీమ‌ణి.. దేశ ప్ర‌తిష్ట‌ను విదేశాల్లో మంటగ‌ల‌ప‌టం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.
అనారోగ్యం కార‌ణంగా వైద్య సేవ‌ల కోసం రాబ‌ర్ట్ ముగాబే స‌తీమ‌ణి గ్రేస్ ముగాబే మెడిక‌ల్ పాస్ పోర్ట్ మీద ద‌క్షిణాఫ్రికాకు వ‌చ్చారు. ఇద్ద‌రు కొడుకుల్ని తీసుకొచ్చిన ఆమె వైద్య సేవ‌ల్లో భాగంగా హోట‌ల్లో ఉంటున్నారు. తాజాగా ఒక మోడ‌ల్‌.. రాబ‌ర్ట్ ముగాబే పిల్ల‌ల‌తో మాట్లాడేందుకు హోట‌ల్‌కు వెళ్లారు. కొడుకుల‌తో మాట్లాడుతున్న మోడ‌ల్ ను చూసిన దేశాధ్య‌క్షుడి స‌తీమ‌ణి ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ ఆమెపై దాడి చేశారు. కొడుకులు ఎంత వారిస్తున్నా విన‌కుండా స‌ద‌రు మోడ‌ల్ ను కొర‌డాతో  చిత‌క్కొట్టేశారు.

ఆ చేదు అనుభ‌వంతో హ‌డ‌లిపోయిన మోడ‌ల్ హోట‌ల్ నుంచి బ‌య‌ట‌ప‌డి జోహాన్నెస్ బ‌ర్గ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గ్రేస్ ముగాబేను అరెస్ట్ చేసేందుకు హోట‌ల్ కు వెళ్లారు. అయితే.. అప్ప‌టికే ఆమెకొడుకుల‌తో క‌లిసి జింబాబ్వేకు వెళ్లిపోయిన‌ట్లు గుర్తించారు. ఆమెకు సంబంధించిన వివ‌రాల కోసం ఆ దేశ విదేశాంగ మంత్రితో  ద‌క్షిణాఫ్రియా పోలీసులు మాట్లాడుతున్న‌ట్లు చెబుతున్నారు. గ్రేస్ ముగాబే గ‌తంలోనూ ఇదే తీరులో వ్య‌వ‌హ‌రించి.. విచ‌క్ష‌ణా ర‌హితంగా ఒక వ్య‌క్తిగా దాడి చేసిన ఘ‌ట‌న ఉంద‌ని చెబుతున్నారు. అప్ప‌ట్లో కూడా ఇదే రీతిలో దాడి చేసి.. పోలీసులు వ‌చ్చేస‌రికి ఆ దేశం నుంచి త‌ప్పించుకు వెళ్లిపోయిన‌ట్లుగా తెలుస్తోంది.  ప్ర‌స్తుతం గ్రేస్ ముగాబే జింబాబ్వే వెళ్లిపోయిన‌ట్లు చెబుతున్నా.. ఆ విష‌యాన్ని ఎవ‌రూ ఖ‌రారు చేయ‌క‌పోవ‌టం గ‌మ‌నార్హం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు