అసలు సత్తా ఏంటో ఇప్పుడు తెలుస్తుంది

అసలు సత్తా ఏంటో ఇప్పుడు తెలుస్తుంది

లాంగ్ వీకెండ్ అడ్వాంటేజీ కోసమని ఎంత పోటీ ఉన్నా వెనక్కి తగ్గలేదు మూడు సినిమాలు. పోటీ వల్ల కలెక్షన్లపై ప్రభావం ఉంటుందని తెలిసినా ధైర్యంగా మూడు సినిమాల్నీ రేసులోకి దించేశారు. ‘నేనే రాజు నేనే మంత్రి’.. ‘జయ జానకి నాయక’.. ‘లై’.. మూడూ కూడా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఈ మూడింట్లో దేనికీ నెగెటివ్ టాక్ రాకపోవడం విశేషమే. అయినప్పటికీ వీటికి కలెక్షన్లు మాత్రం ఆశించిన స్థాయిలో లేవు.

ఉన్నంతలో ‘నేనే రాజు నేనే మంత్రి’ పరిస్థితి మెరుగు. తర్వాత ‘జయ జానకి నాయక’ నిలిస్తే.. ‘లై’ చివరి స్థానానికి పరిమితమైంది. మూడు రోజుల వీకెండ్‌కు తోడు.. తర్వాత రెండు రోజులు సెలవులుండటం వల్ల ఐదు రోజుల పాటు ఈ మూడు సినిమాలూ ఓ మోస్తరుగానే వసూళ్లు రాబట్టాయి. కలెక్షన్లు మరీ గొప్పగా లేకపోయినా.. ఓకే అనిపించాయి. ఐతే ఇప్పుడు సెలవులు అయిపోయాయి.

బుధవారం నాడు ఈ సినిమాలు ఎలా పెర్ఫామ్ చేస్తాయన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. అంతిమంగా ఏ సినిమా ఫలితం ఎలా ఉంటుందన్నది ఈ రోజు వసూళ్లను బట్టి తేలిపోతుంది. దీంతో ఈ రోజు కలెక్షన్ రిపోర్ట్ కోసం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ రోజు రాత్రికి ఒక క్లారిటీ రావచ్చు. తక్కువ బడ్జెట్లో తెరకెక్కి.. బిజినెస్ కూడా అందుకు తగ్గట్లే చేసిన ‘నేనే రాజు నేనే మంత్రి’ పరిస్థితి మాత్రమే కొంచెం మెరుగ్గా కనిపిస్తోంది.

మిగతా రెండు సినిమాలపై భారీ పెట్టుబడులు పెట్టడం.. బిజినెస్ కూడా పెద్ద స్థాయిలో జరగడం వల్ల ఇబ్బందులు తప్పేట్లు లేదు. ఎన్నికల్లో అభ్యర్థులు ఎక్కువైతే ఓట్లు చీలిపోయినట్లుగా.. సినిమాలు ఎక్కువైపోయి కలెక్షన్లు కూడా చీలిపోవడం మూడు సినిమాలకూ ఇబ్బందిగానే మారింది. ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే ‘జయ జానకి నాయక’.. ‘లై’ సేఫ్ కావడం అసాధ్యంగానే కనిపిస్తోంది. ఈ రోజు వసూళ్లలో డ్రాప్ మరీ ఎక్కువ లేకపోతే.. తక్కువ నష్టాలతో బయటపడొచ్చు. డ్రాప్ మరీ ఎక్కువ ఉంటే మాత్రం భారీ నష్టాలు తప్పవన్నట్లే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు