ఇది నిజమైతే.. ఎన్టీఆర్ గ్రేటే

ఇది నిజమైతే.. ఎన్టీఆర్ గ్రేటే

విలక్షణ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటికి ఎన్టీఆర్ అవకాశమిస్తున్నాడన్న వార్త ఈ ఉదయం నుంచి టాలీవుడ్లో ఆసక్తికర చర్చకు తావిస్తోంది. యేలేటి స్థాయికి ఎన్టీఆర్‌తో సినిమా చేయడం ఏంటని కొందరికి అనిపిస్తుండొచ్చుగాక.. కానీ ఈ కాంబినేషన్ నిజంగా ఓకే అయితే మాత్రం ఒక సెన్సేషనల్ మూవీని ఆశించొచ్చు. ఎన్టీఆర్ కెరీర్‌ను కచ్చితంగా ఈ సినిమా మలుపు తిప్పుతుందని ఆశించవచ్చు.

యేలేటి కెరీర్లో కమర్షియల్ సక్సెస్‌లు తక్కువే కావచ్చు.. కానీ అతను ఓ అరుదైన దర్శకుడు. తొలి సినిమా ‘ఐతే’ అయినా.. తర్వాతి సినిమా ‘అనుకోకుండా ఒక రోజు’ అయినా తెలుగు సినిమా చరిత్రలోనే ప్రత్యేకంగా నిలిచిపోయేవే. అలాంటి థ్రిల్లర్లను తెలుగులో అస్సలు ఊహించలేని రోజుల్లో.. అందరూ కమర్షియల్ సినిమాల మత్తులో కొట్టుకుంటున్న రోజుల్లో యేలేటి ఎంతో విలక్షణంగా ఆలోచించి.. సాహసోపేత సినిమాలు తీశాడు. తెలుగు దర్శకుల్లో తాను చాలా ప్రత్యేకంగా నిలిచాడు.

కాలాని కంటే ముందు ఆలోచించడం వల్ల యేలేటి సినిమాలు ఆయా సమయాల్లో ఆశించిన స్థాయిలో ఆడలేదు కానీ.. అతను మామూలు దర్శకుడైతే కాదు. సరైన హీరో దొరికి.. మంచి కథ సెట్ చేసుకుంటే యేలేటి స్థాయే వేరుగా ఉంటుంది. గత మూణ్నాలుగేళ్లుగా అందరూ కొత్తదనం కొత్తదనం అంటున్నారు కానీ.. దశాబ్దంన్నర కిందటే చాలా కొత్తగా అనిపించే సినిమాలు తీశాడు యేలేటి. ‘టెంపర్’ దగ్గర్నుంచి వైవిధ్యమైన కథలతో ప్రయాణం చేస్తూ.. తన కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్తున్నాడు తారక్.

‘నాన్నకు ప్రేమతో’ లాంటి సినిమానైతే ఎన్టీఆర్ నుంచి అస్సలు ఊహించలేం. ఆ సినిమాతో క్లాస్ ప్రేక్షకుల మనసుల్లో తొలిసారి చోటు సంపాదించిన తారక్.. యేలేటితో సినిమా చేస్తే.. ఆ వర్గం ప్రేక్షకుల్లోకి మరింతగా చొచ్చుకెళ్తాడనడంలో సందేహం లేదు. యేలేటి గత కొన్నేళ్లలో తీసిన సినిమాల ఫలితాల గురించి ఆలోచించకుండా అతడికి అవకాశం ఇవ్వాలనుకోవడం గొప్ప విషయమే. ఈ అవకాశాన్ని యేలేటి సద్వినియోగం చేసుకుని.. తారక్‌కు తగ్గ కథతో వచ్చాడంటే.. ఈ సినిమా ఇద్దరికీ ఒక మైలురాయి కావడం ఖాయం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English