ఫిదా.. ఇవి మామూలు ఘనతలు కావు

ఫిదా.. ఇవి మామూలు ఘనతలు కావు

సినిమాలో కంటెంట్ ఉండాలే కానీ.. స్టార్ కాస్ట్.. భారీ ప్రచార హంగామా ఏమీ అక్కర్లేదని రుజువు చేసింది ‘ఫిదా’ సినిమా. హీరోగా ఒక ఇమేజ్ అంటూ లేని వరుణ్ తేజ్.. కొత్తమ్మాయి సాయిపల్లవిలను జంటగా పెట్టి శేఖర్ కమ్ముల తీసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సృష్టిస్తున్న ప్రకంపనలకు అందరికీ దిమ్మదిరిగిపోతోంది. ఈ సినిమాకు ముందు వరుణ్ తేజ్ వరుస ఫ్లాపుల్లో ఉన్నాడు. కమ్ముల అయితే ఫ్లాపుల దెబ్బకు మూడేళ్లుగా సినిమాలే తీయట్లేదు. ఇలాంటి స్థితిలో వచ్చిన ‘ఫిదా’ పెద్ద సినిమాల స్థాయిలో కలెక్షన్ల పంట పండించడం విశేషం. రూ.10 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి.. రూ.18 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ చిత్రం.. ఇప్పటిదాకా రూ.41 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ షేర్ రాబట్టడం విశేషం. నాలుగో వారంలో సైతం ఈ సినిమా చెప్పుకోదగ్గ వసూళ్లు సాధిస్తోంది.

అమెరికాలో 2 మిలియన్ డాలర్ల అరుదైన మైలురాయి సాధించిన సినిమాగా ‘ఫిదా’ నిలిచింది. ‘బాహుబలి’ కాకుండా ‘శ్రీమంతుడు’.. ‘ఖైదీ నెంబర్ 150’.. ‘అఆ’.. ‘నాన్నకు ప్రేమతో’ మాత్రమే ఇప్పటిదాకా ఆ క్లబ్బులోకి చేరాయి. ఇందులో ‘అఆ’ మినహాయిస్తే అన్నీ భారీ సినిమాలే. ‘అఆ’కు కూడా త్రివిక్రమ్ లాంటి స్టార్ డైరెక్టర్.. నితిన్-సమంత లాంటి స్టార్ కాస్ట్ సపోర్ట్ ఉంది. కానీ ‘ఫిదా’కు ఇవేమీ లేకున్నా సంచలన వసూళ్లు సాధించింది. ఈ చిత్రం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో మాత్రమే కోటి రూపాయల గ్రాస్ వసూలు చేయడం కూడా సంచలనమే. మామూలుగా పెద్ద సినిమాలు మాత్రమే అక్కడ ఈ స్థాయిలో వసూళ్లు సాధిస్తాయి. మరోవైపు కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు లాంటి చిన్న టౌన్లో కూడా ‘ఫిదా’ సాధించిన వసూళ్లు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. అక్కడ మహేష్ బ్లాక్ బస్టర్ ‘శ్రీమంతుడు’ ఫుల్ రన్లో 8.26 లక్షల గ్రాస్ రాబడితే.. ‘ఫిదా’ ఇప్పటికే రూ.8.4 లక్షలు కొల్లగొట్టిందట. ఇలా ‘ఫిదా’కు సంబంధించి ఏ ఫిగర్ చూసినా ఆశ్చర్యమేస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు