‘స్పైడర్’తో పెద్ద సమస్య అదే..

‘స్పైడర్’తో పెద్ద సమస్య అదే..

మహేష్ బాబు పుట్టిన రోజు కానుకగా రిలీజైన ‘స్పైడర్’ టీజర్ ఇటు తెలుగు ప్రేక్షకుల్నే కాక.. తమిళ ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకుంది. ఈ టీజర్‌కు అన్ని వైపులా పాజిటివ్ రెస్పాన్సే కనిపించింది. కాకపోతే ఈ టీజర్ చూసిన తెలుగు ప్రేక్షకులు ఒక విషయంలో మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో ‘తమిళ’ వాసనలు ఎక్కువైపోయాయేమో అన్న ఆందోళన మన ప్రేక్షకుల్లో కనిపిస్తోంది. ‘స్పైడర్’కు తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. పైగా ఇది తమిళంలోనూ విడుదలవుతోంది. కాబట్టి తమిళ నటీనటులు.. సాంకేతిక నిపుణుల్ని ఎంచుకోవడాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ మరీ వాళ్లతోనే సినిమాను నింపేశాడేమో అన్న సందేహాలే మన జనాల్ని కలవరపెడుతున్నాయి.

‘స్పైడర్’ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ తమిళుడు. ఈ చిత్ర సంగీత దర్శకుడు హ్యారిస్ జైరాజ్ తమిళుడు. వీళ్లతో పాటు మురుగదాస్ సినిమాలకు మామూలుగా పని చేసే టెక్నీషియన్లు దీనికి వర్క్ చేస్తున్నారు. ఈ సినిమాలో నటీనటులు కూడా మెజారిటీ తమిళియన్లే ఉన్నట్లుగా కనిపిస్తోంది. విలన్ పాత్రల్లో కనిపించనున్న ఎస్.జె.సూర్య.. భరత్ ఇద్దరూ కూడా తమిళులే. ‘బిచ్చగాడు’ సినిమాలో హీరో తల్లి పాత్ర చేసిన ఆవిడ ఇందులో రకుల్ ప్రీత్ తల్లిగా నటిస్తోంది. ఆర్జే బాలాజీ కూడా ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఇలా ఎటు చూసినా ‘స్పైడర్’లో తమిళ వాసనలే కొడుతున్నాయి. కథాంశం కూడా తమిళంలో ఇంతకుముందు వచ్చిన సినిమాల తరహాలోనే కనిపిస్తోంది. మహేష్ బాబును తమిళ ప్రేక్షకులకు కూడా చేరువ చేయాలని చూడటం ఏంటో కానీ.. ఇందులో అరవ వాసనలు ఎక్కువైపోయి మన ప్రేక్షకులు డిస్కనెక్ట్ అయిపోయేలాగా సినిమా ఉంటుందేమో అన్న సందేహాలు కలుగుతున్నాయిప్పుడు. ఈ సందేహాలు ఎంత వరకు నిజమో సెప్టెంబరు 26న చూద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు